భీమ్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..

  • బినామీలపై పట్టు కోసం ముందస్తు ‘క్యాన్సిలేషన్ డీడ్లు’..!
  • రూ.300 కోట్ల అక్రమాస్తులపై దర్యాప్తు

ఆంధ్రప్రభ, హైదరాబాద్ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన డీఎస్పీ భీమ్‌రెడ్డి వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను వెల్లడించింది. అక్రమాస్తులను దాచేందుకు ఆయన పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు ఏసీబీ పేర్కొంది. సోదాల సమయంలో స్వాధీనం చేసుకున్న రెండు మెమరీ కార్డులు, వ్యక్తిగత డైరీల ఆధారంగా భీమ్‌రెడ్డి సుమారు రూ.300 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు. డిజిటల్ ఆధారాలు, ఆస్తి పత్రాల పరిశీలన ఆధారంగా మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయని వెల్లడించారు.

బినామీలతో ముందస్తు ఒప్పందాలు…

అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకునేందుకు భీమ్‌రెడ్డి ప్రత్యేక వ్యూహం అమలు చేసినట్లు ఏసీబీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. బినామీల పేర్లపై ఆస్తులు కొనుగోలు చేసే సమయంలోనే వారి నుంచి ముందస్తుగా ‘క్యాన్సిలేషన్ డీడ్లు’ రాయించుకుని తన వద్ద ఉంచుకున్నట్లు గుర్తించినట్లు తెలిపింది. భవిష్యత్తులో బినామీలు ఆస్తులపై హక్కులు కోరినా లేదా తనకు వ్యతిరేకంగా వ్యవహరించినా వాటిని తిరిగి తన ఆధీనంలోకి తీసుకునేలా ఈ పత్రాలను వినియోగించుకునే ప్రయత్నం చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మొదట తన పేరుతో కొనుగోలు చేసిన కొన్ని ఆస్తులను అనంతరం వ్యూహాత్మకంగా బినామీల పేర్లకు మార్చినట్లు దర్యాప్తులో తేలినట్లు ఏసీబీ పేర్కొంది.

డైరీలు, డిజిటల్ ఆధారాల్లో కీలక సమాచారం…

సోదాల సమయంలో భీమ్‌రెడ్డి వ్యక్తిగత డైరీలు కూడా ఏసీబీకి లభించాయి. అందులో “నాకు ఇవ్వాల్సిన వాళ్లు.. నేను ఇవ్వాల్సినవి” అంటూ రాసుకున్న వివరాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే కొన్ని రహస్య ఫొటోలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన నివసిస్తున్న విలాసవంతమైన విల్లా కొనుగోలు కోసం నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై ప్రశ్నించగా, సరైన వివరణ ఇవ్వలేదని ఏసీబీ పేర్కొంది.

ఏసీబీ సోదాల సమయంలో భీమ్‌రెడ్డి శ్వాసకోశ సమస్యలకు గురైనట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దీంతో తొలుత స్థానిక వైద్యులతో చికిత్స అందించి, అనంతరం సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వైద్యుల సూచన మేరకు ఆయనకు విశ్రాంతి అవసరమని తేలడంతో ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం అరెస్టు ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు అధికారులు వివరించారు.

భీమ్‌రెడ్డికి బెయిల్ మంజూరైతే బినామీలను ప్రభావితం చేసి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఏసీబీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఇప్పటివరకు ఆయనకు సంబంధించిన 10 బ్యాంకు ఖాతాలు, రెండు లాకర్లు సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. మరిన్ని అక్రమ ఆస్తులు, లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.