కాళేశ్వరం బ్యాక్ వాటర్ తోనే గోదావరి నదికి జలకళ

  • నేడు నీరు లేక గోదారమ్మ ఎడారిగా మారింది
  • గోదావరి ఖనిలో నదిని పరిశీలించిన హరీష్ రావు

గోదావరిఖని, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంతో పచ్చగా వర్ధిల్లేందుకు నిర్మాణం చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో తల్లి గోదావరి నది నాడు జలకలతో నిండుకుండలా కనిపించేదని… ప్రస్తుతం ప్రాజెక్టులో నీరు నిల్పకపోవడం మూలంగా గోదావరి నది ఎడారిగా మారిందని మాజీ మంత్రి, శాసనసభ పక్ష ఉపనేత తన్నీరు హరీష్ రావు అన్నారు.

బుధవారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గోదావరి నదిని హరీష్ రావు పరిశీలించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించే సింగరేణి పరిరక్షణ సదస్సుకు తరలి వెళ్తున్న హరీష్ రావుకు గోదావరి నది బ్రిడ్జి వద్ద చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో హరీష్ రావుకు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి గోదావరి నదిని పరిశీలిస్తూ… గతంలో గోదావరి నది తీరం పరిస్థితి… ప్రస్తుతం నీరు నిల్వ లేకుండా ఎడారిగా కనిపిస్తున్న దృశ్యాల వివరాలను సేకరించారు. గోదావరి నది ప్రస్తుతం నీరు లేకుండా ఎడారిగా మారిన పరిస్థితుల వివరాలను హరీష్ రావుకు బాల్క సుమన్ ఈ సందర్భంగా క్షుణ్ణంగా వివరించారు.

జూలై వచ్చిన ఇప్పటివరకు గోదావరి నదిలో నీరు లేకుండా కనిపిస్తున్న పరిస్థితులతో వ్యవసాయం కష్టంగా మారిందని హరీష్ రావుకు బాల్క సుమన్ విన్నవించారు. సుందిళ్ల బ్యారేజీ… కాలేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి బ్యాక్ వాటర్ నిరంతరం నిల్వగా ఉండడంతో నది నిండుగా కనిపించేదని ప్రస్తుతం అది లేకపోవడం వల్ల ఎడారిగా మారడం బాధాకరమని హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తోపాటు భారత రాష్ట్ర సమితి ప్రతినిధులు ఉన్నారు.