Hyderabad Data Center | ముంబై తర్వాత డేటా సెంటర్ల హబ్‌గా హైదరాబాద్
Hyderabad Data Center | ముంబై తర్వాత డేటా సెంటర్ల హబ్‌గా హైదరాబాద్
Hyderabad Data Center | డేటా సెంటర్ల మార్కెట్‌లో దూసుకెళ్తున్న హైదరాబాద్
మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడితో పెరుగుతున్న అవకాశాలు
అమెజాన్, ఒరాకిల్‌తో భాగ్యనగరానికి మరింత ఊపు
Hyderabad Data Center | హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్ల మార్కెట్లలో ఒకటిగా హైదరాబాద్ అవతరించింది. ఒక్క ఐటీ రంగానికే పరిమితం కాకుండా, పలు రకాల మౌలిక సదుపాయాలకు కేంద్రంగానూ భాగ్యనగరం రూపాంతరం చెందుతోంది. ఇప్పటికే పనిచేస్తున్న అమెజాన్ డేటా సెంటర్లకు తోడుగా మైక్రోసాఫ్ట్ తదితర డేటా సెంటర్ల నిర్మాణం కార్యరూపం దాలిస్తే హైదరాబాద్ మార్కెట్ వాటా ఇంకా పెరుగుతుంది. ఫ్యూచర్ సిటీ అందుబాటులోకి వస్తే మరింత ఊపందుకునే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
అంతర్జాతీయ కార్పొరేషన్లు తమ కార్యకలాపాలకు అనువైన నగరంగా హైదరాబాద్‌ను గుర్తించాయి. భారత్‌లో 100 కోట్ల మందికి పైగా ఇంటర్నెట్ వినియోగదారులున్న నేపథ్యంలోనే గతేడాది చివరిలో మైక్రోసాఫ్ట్ రూ.1.45 లక్షల కోట్ల భారీ పెట్టుబడిని ప్రకటించింది. ఈ సంస్థకు పుణె, చెన్నై, ముంబయిలలో డేటా సెంటర్లు ఉన్నా, హైదరాబాద్‌లో నిర్మిస్తున్న డేటా సెంటర్ల సముదాయమే పెద్దదిగా నిలవనుంది. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో ఈ ఏడాది ప్రారంభించే ఇండియా సౌత్ సెంట్రల్ డేటా సెంటర్ కోసం షాద్‌నగర్‌లో 41, మేకగూడలో 22, చందన్‌వెల్లిలో 53 ఎకరాల్లో నిర్మాణాలు చేస్తోంది. సమీపంలోని కొత్తూర్, నందిగామ ప్రాంతాల్లో కూడా స్థలాలు కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
తమ డేటా సెంటర్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని మైక్రోసాఫ్ట్ ఇండియా-దక్షిణాసియా అధ్యక్షుడు వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ ఏఐ సేవలకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు వినియోగదారులుగా ఉండటం కూడా ఆ సంస్థ విస్తరణకు తోడ్పడుతుందనడంలో సందేహం లేదు. మరోవైపు ఒరాకిల్ కూడా హైదరాబాద్‌లో కొత్త డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే అమెజాన్ వెబ్ సర్వీసెస్ మూడు జోన్లను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ 46 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది.
ముంబై తర్వాత హైదరాబాద్…
2022లో 60.9 మెగావాట్ల (ఎండబ్ల్యూ) వద్ద ఉన్న డేటా సెంటర్ల సామర్థ్యం 2025 నాటికి 151.4 మెగావాట్లకు చేరుకుంది. మరో 1.9 గిగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని, ఈ విషయంలో ముంబై తర్వాత స్థానం హైదరాబాద్‌దేనని స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. ఈ సంస్థ ఇటీవల విడుదల చేసిన ఇండియా డేటా సెంటర్ మార్కెట్ అప్‌డేట్-2025 నివేదికలో ఈ విషయం వెల్లడించింది. హైదరాబాద్‌కు గల భౌగోళిక అనుకూలతతో పాటు గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (జీపీయూ), లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీలకు మద్దతు ఇచ్చే ప్రభుత్వ కార్యక్రమాలు డేటా రంగం విస్తరణకు తోడ్పడుతున్నాయని నివేదిక పేర్కొంది. అదానీ కానెక్స్, ఎన్టీటీ వంటి కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని నైట్ ఫ్రాంక్ తెలిపింది.
