పెద్దపల్లిలో విషాదం..

పెద్దపల్లి, ఆంధ్రప్రభ: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం కేశనపల్లి గ్రామంలో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద పడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదావరిఖని నుంచి ఒడేడ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కేశనపల్లి మూలమలుపు వద్ద ప్రయాణికులను దింపి బయలుదేరుతున్న సమయంలో తిరుపతిరావు (38) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు బస్సు వెనుక టైరు కింద పడ్డాడు. ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడు గ్రీన్‌ఫీల్డ్ హైవే పనుల కోసం కూలీగా వచ్చి పనిచేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.