సాయికృష్ణ కేసులో రాజకీయాలకు అతీతంగా న్యాయం జరగాలి..
- వాస్తవాలు, ఆధారాలే ప్రామాణికం..
- కుల, రాజకీయ కోణాలతో కేసును మళ్లించొద్దు…
- బాధితులకు న్యాయం, సమాజానికి సత్యం, కుటుంబానికి సమాధానం దక్కాలి…
- కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ ఇన్‌ఛార్జి భర్గవ్ వల్లూరు
విజయవాడ, ఆంధ్రప్రభ : సాయికృష్ణ మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో రాజకీయాలు, భావోద్వేగాలు, ఊహాగానాలకు అతీతంగా వాస్తవాల ఆధారంగా దర్యాప్తు జరగాలని కాంగ్రెస్ పార్టీ విజయవాడ పార్లమెంట్ ఇన్‌ఛార్జి భర్గవ్ వల్లూరు పేర్కొన్నారు. సాయికృష్ణ మృతి దురదృష్టకరమని, ప్రతి ప్రాణనష్టం సమగ్ర దర్యాప్తుకు అర్హమైనదేనని ఆయన అన్నారు. అయితే కేసుపై ఎలాంటి నిర్ధారణలు, తీర్పులు ఆధారాలు లేకుండానే వెలువడకూడదని స్పష్టం చేశారు. చట్టపరమైన ప్రక్రియ, దర్యాప్తు సంస్థల నివేదికలు, సాక్ష్యాధారాల ఆధారంగానే నిజానిజాలు వెలుగులోకి రావాలని పేర్కొన్నారు.
సాయికృష్ణపై గతంలో అనేక క్రిమినల్ కేసులు నమోదైనట్లు సమాచారం ఉందని, ముఖ్యంగా మైనర్ బాలికలపై దాడులు, వేధింపులకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు కూడా ఉన్నాయని తెలిపారు. ఆ ఆరోపణల కారణంగా పలువురు బాధితులు, వారి కుటుంబాలు తీవ్ర మానసిక వేదన అనుభవించారని పేర్కొన్నారు. అందువల్ల ఈ కేసులో ప్రతి కోణాన్ని నిష్పక్షపాతంగా పరిశీలించడం అవసరమన్నారు భర్గవ్ వల్లూరు.
ఇటీవలి కాలంలో కొందరు ఈ ఘటనను కుల, రాజకీయ కోణాల్లో చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి ధోరణి అసలు సత్యాన్వేషణను దెబ్బతీస్తుందని భర్గవ్ వల్లూరు ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం అనేది రాజకీయ ప్రయోజనాల సాధనకు లేదా సామాజిక విభేదాలను రెచ్చగొట్టడానికి ఉపయోగించే సాధనం కాదని స్పష్టం చేశారు.
ఈ కేసులో పేరు వినిపిస్తున్న సీఐ నాగరాజు గురించి కూడా ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, ఆయనను నిజాయితీ గల అధికారిగా పలువురు అభివర్ణిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ప్రజాభిప్రాయాలు, మీడియా చర్చలు లేదా రాజకీయ వ్యాఖ్యల ఆధారంగా ఎవరినీ దోషిగా గానీ, నిర్దోషిగా గానీ ప్రకటించరాదన్నారు.
చట్టబద్ధమైన దర్యాప్తు ద్వారా మాత్రమే వాస్తవాలు తేలాలని చెప్పారు. ప్రభుత్వం ఈ కేసులో పూర్తిస్థాయి, పారదర్శక, నిష్పక్షపాత దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అదే విధంగా అధికారులపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని తేలితే ఆ విషయాన్ని కూడా స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలని అన్నారు.
సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంత ఉందో, అతనిపై వచ్చిన ఆరోపణల వల్ల నష్టపోయినట్లు చెబుతున్న బాధితులు, వారి కుటుంబాల పట్ల కూడా అంతే బాధ్యత ఉందని భర్గవ్ వల్లూరు పేర్కొన్నారు. ఆరోపణలు చట్టపరంగా రుజువైతే బాధితులకు పరిహారం, పునరావాసం, మానసిక కౌన్సెలింగ్, దీర్ఘకాలిక సహాయ కార్యక్రమాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
“ఈ కేసులో అసలు లక్ష్యం న్యాయం, జవాబుదారీతనం, సమాజ రక్షణ కావాలి. బాధితులకు న్యాయం జరగాలి. మృతుడి కుటుంబానికి నిజాలు తెలియాలి. ప్రజలకు సత్యం తెలిసేలా చేయాలి. కుల రాజకీయాలు, సంచలన ప్రచారం, రాజకీయ లబ్ధి కోసం చేసే ప్రయత్నాలు ఈ లక్ష్యాలను దెబ్బతీయకూడదని భర్గవ్ వల్లూరు పేర్కొన్నారు.
