సీఎం పర్యటనతోనైనా రహదారి విస్తరణ జరిగేనా..?
సీఎం పర్యటనతోనైనా రహదారి విస్తరణ జరిగేనా..?
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిలకలూరిపేట పర్యటన నేపథ్యంలో నియోజకవర్గంలోని పలు సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా నరసరావుపేట సెంటర్ నుంచి లింగంగుంట్ల గ్రామం వరకు ఉన్న రహదారి ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రహదారి పక్కల భారీ గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు వెడల్పు తక్కువగా ఉండటంతో పాటు మార్జిన్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎదురెదురుగా వచ్చే వాహనాలకు దారి ఇచ్చే క్రమంలో వాహనాలు గుంతల్లోకి దిగిపోతుండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు గాయపడగా, కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా జరిగాయని స్థానికులు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు ఈ రహదారి పరిస్థితిని పరిశీలించి, అత్యవసరంగా గుంతలను పూడ్చడంతో పాటు రోడ్ మార్జిన్‌లను బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే సహా ప్రజాప్రతినిధులు స్పందించి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
“ప్రజల ప్రాణాల కంటే ముఖ్యమైనది ఏదీ కాదు. మరో ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి రోడ్డును సురక్షితంగా మార్చాలి” అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం పర్యటనతోనైనా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందా అనే ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు.
