QS Rankings-2027 | గ్లోబల్ టాప్ యూనివర్సిటీల్లో 52 విధ్యాస్థ‌ల‌కు చోటు..

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: ప్రపంచ ప్రఖ్యాత క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2027లో భారతీయ సాంకేతిక విద్యాసంస్థ ఐఐటీ ఢిల్లీ మరోసారి తన సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా 118వ స్థానాన్ని దక్కించుకుని వరుసగా రెండో ఏడాది దేశంలోనే అత్యున్నత ర్యాంక్ సాధించిన విద్యాసంస్థగా నిలిచింది. గత ఏడాది 123వ స్థానంలో ఉన్న ఐఐటీ ఢిల్లీ ఈసారి ఐదు స్థానాలు మెరుగుపరుచుకోవడం విశేషం.

అంతే కాకుండా ఈ ఏడాది ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మొత్తం 52 భారతీయ విద్యాసంస్థలు చోటు దక్కించుకోగా, వాటిలో 13 విశ్వవిద్యాలయాలు ప్రపంచ టాప్-550లో నిలాచాయి. ఇక ప్రపంచ టాప్-200లో భారత్‌కు చెందిన కేవలం మూడు విద్యాసంస్థలకే స్థానం లభించింది. ఐఐటీ ఢిల్లీ 118వ ర్యాంక్‌తో దేశంలో అగ్రస్థానంలో నిలవగా, ఐఐటీ బాంబే 134వ స్థానం, ఐఐటీ మద్రాస్ 170వ స్థానాన్ని దక్కించుకున్నాయి. టాప్-200లోకి ప్రవేశించేందుకు చేరువలో ఉన్న ఐఐటీ ఖరగ్‌పూర్ 205వ స్థానంలో నిలిచింది. అలాగే భారత విజ్ఞాన సంస్థ (ఐఐఎస్‌సీ) బెంగళూరు, ఐఐటీ కాన్పూర్ సంయుక్తంగా 221వ ర్యాంక్ సాధించాయి.

ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హర్షం వ్యక్తం చేశారు. భారత విద్యాసంస్థలు టీచింగ్, రీసెర్చ్, ఇన్నోవేషన్, ఇంటర్నేషనల్ కలాబరేషన్స్, అకడమిక్ రిప్యుటేషన్ రంగాల్లో గణనీయ పురోగతి సాధిస్తున్నాయని ఆయన అన్నారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)-2020 అమలు తర్వాత ఉన్నత విద్యా రంగంలో సంస్కరణలు వేగవంతమయ్యాయని, బహుళశాఖల అధ్యయనం, పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం పెరగడం వల్లే ఈ ఫలితాలు కనిపిస్తున్నాయని వివరించారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో ప్రపంచ స్థాయి ఉన్నత విద్యా వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది అని ప్రధాన్ పేర్కొన్నారు.