భూగర్భ జలాలు పెంచుకుందాం
- కలెక్టర్ భవేశ్ మిశ్రా
- లక్కడి జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన భేష్
- త్వరలోనే అమలుకు కార్యాచరణ
నిర్మల్, ఆంధ్రప్రభ: నీటిని వృథాగా పోనివ్వకుండా భూగర్భ జలాలుగా మలుచుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ఈ క్రమంలో ప్రముఖ కాంట్రాక్టర్, సామాజిక సేవకుడు లక్కడి జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సూచన ఎంతో ఉపయోగకరంగా ఉందని, దీని అమలుకు త్వరలోనే కార్యాచరణ చేపడతామని తెలిపారు.
భవిష్యత్తులో భూగర్భ జలాల సమస్యలు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో లక్కడి జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్‌ను కలిసి పలు సూచనలు చేశారు.
డ్రైనేజీల్లోనే ఇంకుడు గుంతలు…
నీటిని వృథా కాకుండా భూగర్భ జలాలుగా మార్చుకునేందుకు ప్రత్యేక శ్రేణి–1 కాంట్రాక్టర్, సామాజిక సేవకుడు లక్కడి జగన్‌మోహన్‌రెడ్డి వినూత్న సూచనలు చేశారు. నాళాలు, కందకాలు, డ్రైనేజీల్లో ఇంకుడు గుంతలను నిర్మించాలని ప్రతిపాదించారు. వాటి నిర్మాణ విధానాన్ని కలెక్టర్‌కు వివరించారు.అలాగే గుట్ట ప్రాంతాల నుంచి ప్రవహించే వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకునే విధానాలపై కూడా వివరించారు. ఈ ప్రతిపాదనలపై కలెక్టర్ భవేశ్ మిశ్రా సానుకూలంగా స్పందిస్తూ, జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనను అభినందించారు. వాటి అమలుకు తగిన కార్యాచరణ చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా లక్కడి జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
