లాకప్‌డెత్ ఘటనపై సీబీఐ విచారణ జరగాలి..

లాకప్‌డెత్ ఘటనపై సీబీఐ విచారణ జరగాలి..

సీపీ, ఏసీపీ, డీజీపీ పాత్రపైనా దర్యాప్తు చేయాలి
మాజీ సీఎం వైఎస్ జగన్

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : అత్యంత పాసవికంగా లాకప్ డెత్ జరిగిన సాయి కృష్ణ అంశంపై పూర్తిస్థాయిలో సిబిఐ విచారణ జరపాలని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సాయికృష్ణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిందని, దీనిపై సమగ్ర సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

విజయవాడ నగర నడిబొడ్డున అత్యంత దారుణమైన ఘటన జరిగిందని పేర్కొన్న ఆయన, ఈ వ్యవహారంలో కేవలం సీఐ మాత్రమే కాకుండా ఉన్నత స్థాయి పోలీసు అధికారుల పాత్రపైనా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. సీపీ, ఏసీపీ, డీజీపీ వరకు బాధ్యతను నిర్ధారించాలని కోరారు. మే 9న సాయికృష్ణను పోలీసులు తీసుకెళ్లిన తర్వాత ఆయన ఆచూకీ కోసం తల్లి పలుమార్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిందని జగన్ అన్నారు. తన కుమారుడిని చూపించాలని కోరినా సరైన సమాధానం ఇవ్వలేదని, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోలేదని ఆరోపించారు.

బాధిత కుటుంబం హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా దాఖలు చేసిందని గుర్తు చేశారు. సాయికృష్ణ ఘటనలో సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయంలో కేవలం సీఐ నాగరాజును సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. ఒకరు కాదు, ఇద్దరి మరణాలకు సీఐ కారణమయ్యాడనే ఆరోపణలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయి దర్యాప్తు జరగడం లేదన్నారు.

సాయికృష్ణ తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం కోర్టులు శిక్షించేవని, కానీ పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని వ్యవహరించారని ఆరోపించారు. ఈ కేసులో నిజాలు వెలుగులోకి రావాలంటే సీబీఐతో స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని వైఎస్ జగన్ తెలిపారు.