భక్తులకు సౌకర్యవంతంగా ఇంద్రకీలాద్రి..

భక్తులకు సౌకర్యవంతంగా ఇంద్రకీలాద్రి..

కొండ ప్రాంత విస్తరణకు చర్యలు
గృహ నిర్వాసితులతో ఉన్నతాధికారుల కీలక సమీక్ష భూ సేకరణపై కమిషనర్‌కు త్వరలో నివేదిక

ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి : విజయవాడ లోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో భక్తులకు మెరుగైన వసతులు, సౌకర్యాల కల్పన కోసం ఆలయ విస్తరణ పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు గురువారం దేవస్థాన కార్యాలయంలో ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వి.కె. శీనా నాయక్, విజయవాడ ఆర్డీఓ వెన్నెల శ్రీను, దేవాదాయ శాఖ అధికారులు, ఆర్ అండ్ బి ఎస్.ఇ భాస్కరరావు పాల్గొన్నారు.

ఆలయ విస్తరణలో భాగంగా భూ సేకరణ పరిధిలోకి వచ్చే గృహ నిర్వాసితులతో అధికారులు ముఖాముఖి చర్చలు జరిపి వారి అభిప్రాయాలు, విజ్ఞప్తులను సేకరించారు. ప్రక్రియను చట్టబద్ధంగా, పారదర్శకంగా నిర్వహిస్తూ నిర్వాసితులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
భూ సేకరణకు గుర్తించిన ప్రాంతాలలో అర్జున వీధి – 5 గృహాలు, మల్లికార్జున పేట (ఉత్తర మెట్ల వైపు) – 12 గృహాలు, మల్లికార్జున పేట (కొండపై) – 5 గృహాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఈవో వి.కె. శీనా నాయక్ మాట్లాడుతూ క్షేత్రస్థాయి ఉమ్మడి పరిశీలన అనంతరం పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను దేవాదాయ శాఖ కమిషనర్‌కు సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో దేవస్థాన, రెవెన్యూ, ఆర్ అండ్ బి శాఖల అధికారులు పాల్గొన్నారు.