ఏపీఎల్ లో కాకినాడ కింగ్స్ భారీ స్కోరు
ఏపీఎల్ లో కాకినాడ కింగ్స్ భారీ స్కోరు
అభిషేక్ రెడ్డి విధ్వంసకర సెంచరీ
రాయల్స్ ఆఫ్ రాయలసీమకు 212 పరుగుల లక్ష్యం
కడప, ఆంధ్రప్రభ : ఏపీఎల్-2026 రెండో రోజు తొలి మ్యాచ్లో కాకినాడ కింగ్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న కాకినాడ కింగ్స్ నిర్ణయాన్ని బ్యాటర్లు సమర్థిస్తూ భారీ స్కోరు నమోదు చేశారు. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసి రాయల్స్ ఆఫ్ రాయలసీమ ముందు 212 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఓపెనర్లు అభిషేక్ రెడ్డి, తపస్వి దూకుడుగా ఆడుతూ జట్టుకు శుభారంభాన్ని అందించారు.
తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి కాకినాడ 2 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసి భారీ స్కోరుకు బాటలు వేసింది. అభిషేక్ 32 బంతుల్లో 47 పరుగులు చేయగా, తపస్వి 15 బంతుల్లో 24 పరుగులు సాధించి జట్టు స్కోరును వేగంగా ముందుకు నడిపించారు. అయితే ఇన్నింగ్స్ చివరి వరకు నిలిచిన అభిషేక్ రెడ్డి రాయలసీమ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 60 బంతుల్లోనే 112 పరుగులు చేసి సెంచరీతో చెలరేగిపోయాడు. అతని ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు లేకాజ్ రెడ్డి 17 బంతుల్లో 37 పరుగులు చేసి స్కోరు వేగాన్ని మరింత పెంచాడు.
అతని ఇన్నింగ్స్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. బౌలింగ్లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ తరఫున పార్థసారథి, పురుషోత్తం, గణేష్ చెరో రెండు వికెట్లు పడగొట్టినా, కాకినాడ బ్యాటర్ల దూకుడును పూర్తిగా అడ్డుకోలేకపోయారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగనున్న రాయల్స్ ఆఫ్ రాయలసీమ 120 బంతుల్లో 212 పరుగులు చేయాల్సి ఉంది. దీంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాకినాడ కింగ్స్ ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ, రాయలసీమ బ్యాటర్లు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
