పైరవీ పేరుతో రూ.50 వేల మోసం?
- ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని చేతులెత్తేసిన కాంగ్రెస్ నాయకుడు!
- ఇల్లు వస్తుందని పాత గృహం కూల్చేసిన బాధిత కుటుంబం.. ఇప్పుడు రేకుల షెడ్లో జీవనం
అచ్చంపేట, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు శాశ్వత నివాసం కల్పించాలనే లక్ష్యంతో గృహలక్ష్మి పథకం ద్వారా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుండగా, క్షేత్రస్థాయిలో కొందరు నాయకులు పైరవీల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెలుగుచూస్తున్నాయి. అచ్చంపేట పట్టణంలోని 16వ వార్డులో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.
బాధితురాలు నాంసాని శిల్ప తెలిపిన వివరాల ప్రకారం, అచ్చంపేటకు చెందిన ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తానని నమ్మబలికి రూ.50 వేల నగదు తీసుకున్నాడని ఆరోపించారు. ఆయన మాటలు నమ్మిన తమ కుటుంబం మొదటి విడతలోనే ఇల్లు మంజూరవుతుందనే ఆశతో ఉన్న పాత ఇంటిని కూల్చివేసుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే నెలలు గడిచినా ఇల్లు మంజూరు కాకపోవడంతో ప్రస్తుతం పాత రేకులతో తాత్కాలిక షెడ్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నామని తెలిపారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల ప్రతిపాదనలు సిద్ధమవుతున్నప్పటికీ తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు.
తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆ నాయకుడిని అడిగితే, “అధికారులకు ఖర్చు పెట్టాం” అంటూ ముఖం చాటేస్తున్నాడని ఆరోపించారు. మొదటి విడతలో ఇల్లు వస్తుందనే నమ్మకంతో గృహాన్ని కూల్చివేసినా, ఇల్లు నిర్మించుకునేందుకు తగిన స్థలం లేదనే కారణంతో తమను ఎంపిక చేయలేదని బాధితురాలు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో తమకు న్యాయం చేయాలని, ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది.
