మద్దతు ధర మాయ.. దళారుల దోపిడీ దందా

మద్దతు ధర మాయ.. దళారుల దోపిడీ దందా

  • అచ్చంపేట మార్కెట్ యార్డులో గోసతీస్తున్న రైతన్నలు
  • కొనుగోళ్లు నిలిచిపోయి కన్నీటి పర్యంతమైన రైతన్నలు
  • సౌకర్యాల కల్పనలో విఫలమైన అధికారులు
  • రైతన్నల గోడు పట్టని అధికారులు

అచ్చంపేట, ఆంధ్రప్రభ ; నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డు రైతుల కన్నీళ్లకు వేదికగా మారింది. చెమటోడ్చి పండించిన మొక్కజొన్న పంటను అమ్ముకునేందుకు వచ్చిన రైతన్నలు గత 18 నుంచి 20 రోజులుగా యార్డులోనే పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు రూ.2,400 కాగితాలకే పరిమితమైందని, అధికారుల నిర్లక్ష్యంతో ప్రైవేట్ వ్యాపారులు రైతులను బహిరంగంగా దోచుకుంటున్నారని రైతులు మండిపడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో రైతులు నరకయాతన అనుభవిస్తున్నారు.

పంటను తూకం వేయించేందుకు అవసరమైన గన్నీ బ్యాగులు లేక రైతులు బయట మార్కెట్లో ఒక్కో బ్యాగుకు రూ.33 చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. అంతేకాదు, తూకం వేసి సిద్ధంగా ఉంచిన ధాన్యాన్ని తరలించేందుకు లారీలు రాకపోవడంతో రైతులు రోజుల తరబడి యార్డులోనే మగ్గిపోతున్నారు. ఇక హమాలీల దోపిడీ మరో తలనొప్పిగా మారింది. ఒక్కో బ్యాగు మోసేందుకు, లారీల్లో ఎక్కించేందుకు రూ.25 వరకు రైతుల నుంచి వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట అమ్మితే డబ్బు రావాల్సింది పోయి అదనపు ఖర్చులతో అప్పుల పాలవుతున్నామని రైతన్నలు వాపోతున్నారు.

కనీస సౌకర్యాలు కల్పించని అధికారులు
తాగునీరు, నీడ, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండుతున్న ఎండలో కుటుంబాలతో కలిసి యార్డులోనే ఉండాల్సి వస్తోందని, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వరి ధాన్యం రాకపోయినా వరి రైతులకు గన్నీ బ్యాగులు సమృద్ధిగా అందిస్తున్న అధికారులు, మొక్కజొన్న రైతుల విషయంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారని రైతులు ప్రశ్నిస్తున్నారు.

“మొక్కజొన్న రైతులు రైతులు కారా..?” అంటూ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ప్రభుత్వం రైతు సంక్షేమం పేరుతో గొప్పలు చెప్పుకుంటున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం రైతన్నలు దోపిడీకి గురవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే కొనుగోళ్లు వేగవంతం చేసి, గన్నీ బ్యాగులు సరఫరా చేసి, లారీలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

భయాందోళనలో రైతన్నలు
మొక్కజొన్న ధాన్యం కొనుగోలులో జాప్యం జరగడం ఒక ఎత్తైతే మారుతున్న వాతావరణ పరిస్థితులలో గత 15 రోజులుగా ఎండబెట్టి నిల్వ ఉంచిన ధాన్యం అకాల వర్షానికి ఎక్కడ తడిచి ముద్ద అవుతుందోనని, అదే జరిగితే మరల ధాన్యాన్ని ఆరబెట్టి పస్తులతో మార్కెట్ యార్డులోనే కుటుంబంతో సహా కాలం వెళ్ల తీయాల్సి వస్తుందని రైతులు భయాందోళనలకు గురి అవుతున్నారు.

15 రోజులుగా మార్కెట్లోనే
రైతు అనుపటి ఆంజనేయులు

అధికారులు గన్ని బ్యాగులు ఇవ్వకపోవడం వల్ల బహిరంగ మార్కెట్లో ఒక్కో గన్ని బ్యాగుకు 30 నుంచి 33 రూపాయలు చర్చించి కొనుగోలు చేసుకున్నాము. గన్ని బ్యాగ్లలో మొక్కజొన్న ధాన్యాన్ని నింపి ఉంచి దాదాపు 15 రోజులు అవుతున్న లారీలు లేక కుటుంబంతో సహా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ లోని పడిగాపులు కాస్తున్నాము. ఇన్ని రోజులుగా కనీస సౌకర్యాలు నోచుకోక చాలా ఇబ్బందులు పడుతున్నాము. అధికారులు వెంటనే లారీలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నాము.
ఫోటో రైతప్

రైతు అనుపటి ఆంజనేయులు, కొత్త రాంనగర్ ఉప్పునుంతల
ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి
రైతు దాసరి కురుమయ్య, పల్కపల్లి

20 రోజులుగా తూకము చేసిన మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో 20 రోజులుగా పస్తులతో కుటుంబంతో సహా మార్కెట్ లోనే ఉన్నాము. హమాలీలకు ఒక బ్యాగుకు తూమరియు లారీలోకి ఎత్తేటందుకు 25 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్లో 70 వేల బ్యాగుల వరకు లోడింగ్ కు ఎదురుచూస్తున్నవి. అధికారులు వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.

    Leave a Reply