ఇందిరమ్మ గృహ ప్రవేశాలు ప్రారంభం
ఇందిరమ్మ గృహ ప్రవేశాలు ప్రారంభం
హసన్‌పర్తి, ఆంధ్రప్రభ: ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేదల కుటుంబాలకు సొంతింటి కల సాకారమవుతోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 65వ డివిజన్ ఎల్లాపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు పథకం కింద రూ.5 లక్షల వ్యయంతో నిర్మాణం పూర్తిచేసుకున్న లబ్ధిదారుల గృహ ప్రవేశాలను ఎమ్మెల్యే నాగరాజుతో పాటు కుడా చైర్మన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇనుగాల వెంకట్రామిరెడ్డిలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గౌరవప్రదమైన నివాసాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.
కొత్త ఇంటిలో కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు నేదునూరి సునీల్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
