తిరుపతిలో ఆవిష్కరణలకు కొత్త వేదిక..
తిరుపతిలో ఆవిష్కరణలకు కొత్త వేదిక..
ఆర్‌టీఐహెచ్‌లో ఐడియా ల్యాబ్ ప్రారంభం
డ్రోన్ టెక్నాలజీ, ఏఐ ఆవిష్కరణల్లో అపార అవకాశాలు: కలెక్టర్ వెంకటేశ్వర్
తిరుపతి, ఆంధ్రప్రభ : సాంకేతిక ఆవిష్కరణలు కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. తిరుపతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్)లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐడియా ల్యాబ్, స్టూడియో రూమ్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు.
ఆర్‌టీఐహెచ్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి విజయవంత్ మాథుర్, శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్ రెడ్డితో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొన్న కలెక్టర్, అక్కడ అభివృద్ధి చేస్తున్న వినూత్న సాంకేతిక ఆవిష్కరణలను పరిశీలించారు. యువ ఆవిష్కర్తలు, స్టార్టప్ ప్రతినిధులను అభినందిస్తూ వారి ప్రాజెక్టులపై వివరాలు తెలుసుకున్నారు.
ఏఐ, రోబోటిక్ పరికరాల పరిశీలన
ఈ సందర్భంగా కంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించే కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత పరికరం, పక్షవాతం బాధితుల పునరావాసానికి ఉపయోగపడే స్మార్ట్ హ్యాండ్ గ్లోవ్, మురుగు కాలువల పర్యవేక్షణ, శుభ్రత కోసం రూపొందించిన రోబోటిక్ పరికరాలను కలెక్టర్ పరిశీలించారు. వాటి పనితీరు, సమాజానికి ఉపయోగకరతపై ఆరా తీశారు.
ఆరోగ్యం, పారిశుధ్యం, వ్యవసాయం, విద్య వంటి రంగాల్లో వినూత్న ఆలోచనలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. యువత తమ సృజనాత్మకతను సమాజ సమస్యల పరిష్కారానికి వినియోగించాలని సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రూపొందిన ఆవిష్కరణలే నిజమైన మార్పుకు దోహదపడతాయని పేర్కొన్నారు.
డ్రోన్ టెక్నాలజీలో అపార అవకాశాలు
ప్రస్తుతం ఆర్‌టీఐహెచ్‌లో నిర్వహిస్తున్న డ్రోన్ శిక్షణ శిబిరాన్ని కూడా కలెక్టర్ సందర్శించారు. డ్రోన్ సాంకేతికత వ్యవసాయం, విపత్తు నిర్వహణ, భూసర్వేలు, మౌలిక సదుపాయాల పర్యవేక్షణ వంటి అనేక రంగాల్లో ఉపయోగపడుతోందని తెలిపారు.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా యువత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకుని కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆర్‌టీఐహెచ్ అభివృద్ధికి సహకరిస్తున్న అదానీ గ్రూప్, అమరరాజా గ్రూప్, నవయుగ సంస్థ, ఐఐటీ తిరుపతి తదితర భాగస్వామ్య సంస్థలకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు.
అత్యాధునిక సదుపాయాలతో ఐడియా ల్యాబ్
ఆర్‌టీఐహెచ్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి విజయవంత్ మాథుర్ మాట్లాడుతూ, నూతన ఐడియా ల్యాబ్ విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్‌లకు అత్యాధునిక సదుపాయాలు అందిస్తుందని తెలిపారు. స్టూడియో రూమ్ ద్వారా విజయగాథలు, సాంకేతిక అవగాహన కార్యక్రమాలు, శిక్షణా వీడియోలను రూపొందించి మరింత మందికి చేరవేయనున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌టీఐహెచ్ ఇంక్యుబేషన్ విభాగాధిపతి డాక్టర్ డి. ప్రగతి, రేణిగుంట తహసీల్దార్ శ్రావణ్ కుమార్, స్టార్టప్ వ్యవస్థాపకులు, పరిశ్రమల ప్రతినిధులు, విద్యార్థులు, పరిశోధకులు, ఆర్‌టీఐహెచ్ బృంద సభ్యులు పాల్గొన్నారు.
