ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
కేసముద్రం స్టేషన్ హైస్కూల్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం
కేసముద్రం, జూన్ 17 (ఆంధ్రప్రభ): ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతోందని కేసముద్రం మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ అల్లం రామా నాగేశ్వరరావు పేర్కొన్నారు.
బుధవారం కేసముద్రం స్టేషన్ పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ అల్లం రమ, జిల్లా ఆర్టీఏ సభ్యుడు రావుల మురళి, సొసైటీ వైస్ చైర్మన్ అల్లం నాగేశ్వరరావు, కౌన్సిలర్లు తరాల వీరేష్ యాదవ్, ధారావత్ కిషోర్, ప్రధానోపాధ్యాయుడు బందెల రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల బృందం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆరు నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత భోజనం, యూనిఫాంలు, నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్ తదితర సౌకర్యాల గురించి వివరించారు.
మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ అల్లం రమ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సమగ్ర అభివృద్ధితో కూడిన గుణాత్మక విద్య అందుతోందని అన్నారు. అనవసర ఖర్చులు పెట్టి కార్పొరేట్ పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు.
ప్రధానోపాధ్యాయుడు బందెల రాజు మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులు ఇటీవల 566 మార్కులతో మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించారని తెలిపారు. తమ పాఠశాలలో చేరే విద్యార్థులను నైపుణ్యంతో కూడిన ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతామని అన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు బడిబాట గీతాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. కళాబృందం సభ్యులు మిట్టగడుపుల భరత్ కుమార్, బండ వెంకన్న, మిమిక్రి సురేష్, జిన్నా, అశ్విని, పాషా తదితరులు పాల్గొన్నారు.
