పీజీఆర్ఎస్‌లో 89 ఫిర్యాదులు స్వీకరణ…

పీజీఆర్ఎస్‌లో 89 ఫిర్యాదులు స్వీకరణ…

తక్షణ చర్యలకు ఎస్పీ ఆదేశం

తిరుపతి, ఆంధ్రప్రభ: ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఉండకూడదని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్పష్టం చేశారు. ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును సకాలంలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

సోమవారం తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 89 పిటిషన్లు స్వీకరించారు. ఎస్పీ స్వయంగా ఫిర్యాదుదారుల సమస్యలను విని సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయం అందించడం, ప్రజల సమస్యలకు పారదర్శకంగా పరిష్కారం చూపడం పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి ఫిర్యాదును సానుకూల దృక్పథంతో స్వీకరించి సమయానుకూలంగా పరిష్కరించేందుకు అధికారులు కట్టుబడి పనిచేయాలని సూచించారు.

అందిన ప్రతి పిటిషన్‌ను సంబంధిత అధికారులకు వెంటనే పంపించి, ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. ఫిర్యాదుదారులకు సమస్యల పరిష్కార ప్రక్రియపై పూర్తి వివరాలు తెలియజేసి భరోసా కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవి మనోహరచారి (శాంతిభద్రతలు), శ్రీనివాసులు (క్రైమ్స్), ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, ఫిర్యాదుదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *