సూర్యప్రభపై సారంగపాణిగా కల్యాణ వేంకటేశ్వరుడు

సూర్యప్రభపై సారంగపాణిగా కల్యాణ వేంకటేశ్వరుడు

ఏడవ రోజు బ్రహ్మోత్సవాల్లో భక్తులకు దివ్య దర్శనం

నారాయణవనం, ఆంధ్రప్రభ: నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు బుధవారం ఉదయం స్వామివారు సారంగపాణి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. సూర్యకిరణాల తేజస్సును తలపించే ఈ వాహనసేవలో స్వామివారి రూపం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి వాహనసేవను తిలకించారు.

వేదఘోషలు, మంగళవాయిద్యాల నడుమ సూర్యప్రభ వాహనసేవ కొనసాగింది. స్వామివారి విహార మార్గమంతా భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, సంప్రదాయ మంగళవాయిద్యాలు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

సూర్యప్రభ వాహనసేవకు ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. సకల జీవరాశులకు చైతన్యాన్ని ప్రసాదించే సూర్యుడు ఆరోగ్యప్రదాతగా, జీవనాధారంగా భావిస్తారు. సూర్యమండల మధ్యలో శ్రీమన్నారాయణుడు విరాజిల్లుతాడని శాస్త్రాలు పేర్కొంటాయి. ఈ నేపథ్యంలో సూర్యప్రభ వాహనంపై స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సత్సంతాన ప్రాప్తి కలుగుతాయని పురాణాలు వివరిస్తున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి 7 గంటలకు స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరించి భక్తులను ఆశీర్వదించనున్నారు. ఈ వాహనసేవను తిలకించేందుకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టంగా భావించే రథోత్సవం గురువారం ఉదయం 7.45 గంటలకు నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ, రాత్రి 8.30 గంటలకు శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం జరగనుంది.

ఈ కార్యక్రమాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు నాగరాజు, చెంగల్‌రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply