చట్టపరంగా వివాదాల పరిష్కారమే లక్ష్యం

చట్టపరంగా వివాదాల పరిష్కారమే లక్ష్యం

  • సామరస్యపూర్వకంగా సమస్యలకు ముగింపు
  • జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
  • రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

గోదావరిఖని, ఆంధ్రప్రభ : చట్టబద్ధమైన మార్గంలో వివాదాల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ న్యాయ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. లోక్ అదాలత్ ద్వారా వివాదాలు శాంతియుతంగా, రాజీ మార్గంలో పరిష్కారమవుతాయని తెలిపారు.

రాజీకి అను వైన క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన, కుటుంబ, వైవాహిక కేసులు, బ్యాంకు బకాయిల వసూళ్లు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు వంటి అంశాల్లో ఇరుపక్షాలు పరస్పరం చర్చించుకొని లోక్ అదాలత్ ద్వారా రాజీకి రావచ్చన్నారు. చిన్నచిన్న వివాదాల కారణంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, ధనం వృథా చె సుకోకుండా, న్యాయశాఖ కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని శాంతియుత పరిష్కారం పొందాలని సూచించారు. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పరిధిలోని పోలీసు అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు, ఇతర పోలీసు సిబ్బందికి తగిన మార్గదర్శకాలు అందించి, రాజీకి అనువైన కేసులను గుర్తించాలని కమిషనర్ ఆదేశించారు.

ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి, రాజీ కుదిరేలా కృషి చేయాలని సూచించారు. తమ కేసుల్లో రాజీ కావాలని కోరుకునే వ్యక్తులు సంబంధిత పోలీసు అధికారులను సంప్రదించాలని కోరారు. లోక్ అదాలత్ ద్వారా వివాదాలు త్వరితగతిన పరిష్కారమై బాధితులకు సత్వర న్యాయం అందుతుందన్నారు. ఇరుపక్షాల సమ్మతితో నే రాజీ సాధ్యమవుతుందని, లోక్ అదాలత్లో కుదిరిన రాజీ చట్టపరంగా తుది తీర్పుగా పరిగణించబడుతుందన్నారు. ప్రతి కేసులో న్యాయమూర్తులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తల సమన్వయంతో పరిష్కార ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ప్రజలు, పోలీస్ శాఖ, న్యాయస్థానాలు సమన్వయంతో పనిచేస్తే చిన్న వివాదాలు పెద్ద సమస్యలుగా మారకముందే పరిష్కరించవచ్చని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.