సింగరేణి భవన్ ముట్టడికి కవిత హెచ్చరిక!

సింగరేణి భవన్ ముట్టడికి కవిత హెచ్చరిక!

రూ.50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి.. మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: సింగరేణి సంస్థను కాపాడాలనే చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే, సంస్థకు బకాయిగా ఉన్న రూ.50 వేల కోట్లను వెంటనే చెల్లించాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

‘బాయిబాట’ కార్యక్రమంలో భాగంగా సోమవారం బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని కాసిపేట-1 బొగ్గు గని నుంచి ఆమె యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గనిని సందర్శించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మాట్లాడిన కవిత, సింగరేణిలో వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని, లేదంటే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సింగరేణి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

సింగరేణికి కొత్త బొగ్గు గనులు తీసుకురావాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇవ్వడానికే పరిమితమయ్యారని విమర్శించారు.

సింగరేణిలో కొత్త భూగర్భ గనులను ఏర్పాటు చేస్తే లక్ష మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని రంగాలను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తోందని, అండర్‌గ్రౌండ్ గనులను క్రమంగా నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

కార్మికుల సమస్యలపై హెచ్‌ఎంఎస్ నిరంతరం పోరాటం చేస్తోందని, ఆ సంఘంతో కలిసి ముందుకు సాగుతామని తెలిపారు. డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించకుండా కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. డిపెండెంట్ ఉద్యోగాల సాధన కోసం టీఆర్ఎస్ ఉద్యమం చేపడుతుందని స్పష్టం చేశారు.

సింగరేణిలో జేబీసీసీఐ సభ్యుడిగా ఉన్న హెచ్‌ఎంఎస్ అధ్యక్షుడు ఎండీ రియాజ్ అహ్మద్ కార్మికుల సమస్యలపై యాజమాన్యానికి తలవంచకుండా పోరాడుతున్నారని ప్రశంసించారు.

ప్రస్తుతం సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల్లో ఎక్కువ మంది యువతేనని, వారి పిల్లలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు అందించే ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు తగిన స్థాయిలో లేవని ఆందోళన వ్యక్తం చేశారు.

సింగరేణి కార్మికులు, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై టీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని కవిత పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత సింగరేణిలో ప్రారంభించిన తొలి ‘బాయిబాట’ యాత్రను పోరాటాల గడ్డ అయిన బెల్లంపల్లి నుంచే ప్రారంభించడం విశేషమన్నారు.

తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా ప్రజల ముందుకు వచ్చామని, కార్మికులు, ప్రజల ఆశీర్వాదంతో మరింత బలోపేతమవుతామని కవిత తెలిపారు.

ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్ అధ్యక్షుడు ఎండీ రియాజ్ అహ్మద్, బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు సిద్ధంశెట్టి సాజన్, మాజీ మంత్రి బోడ జనార్ధన్, హెచ్‌ఎంఎస్ నాయకులు పార్వతి రాజిరెడ్డి, వెల్ది సుదర్శన్ తదితరులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.