స్థానిక పీహెచ్‌సీలో మౌలిక సదుపాయాలు కల్పించాలి..

చిట్యాల (ఆంధ్రప్రభ): నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మండలం వెలిమినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తుల లింగస్వామి, తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అరూరు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సమస్యలపై సర్వే నిర్వహించిన అనంతరం ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీహెచ్‌సీలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని, ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయాలని పలుమార్లు కోరినా పరిష్కారం కాలేదన్నారు. ఇన్‌వర్టర్ లేకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వ్యాక్సిన్ల నిల్వకు అవసరమైన రిఫ్రిజిరేటర్ లేకపోవడంతో పాటు, గర్భిణులకు ఐరన్ ఇంజెక్షన్లు ఆరు నెలలుగా, మధుమేహ రోగులకు ఇన్సులిన్ ఇంజెక్షన్లు నాలుగు నెలలుగా అందుబాటులో లేవని ఆరోపించారు. వెంటనే వైద్యాధికారులు స్పందించి కనీస సౌకర్యాలు కల్పించాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

అలాగే నర్సింగ్ ఆఫీసర్ బదిలీ అయిన తర్వాత ఆ పోస్టును భర్తీ చేయలేదని, శాశ్వత అటెండర్ పోస్టు కూడా ఖాళీగానే ఉందని తెలిపారు. ఆరోగ్య కేంద్ర నిర్వహణకు గత మూడు సంవత్సరాలుగా నిధులు విడుదల కావడం లేదని, పేదలకు మెరుగైన వైద్యం అందించాలంటే ఖాళీ పోస్టులు భర్తీ చేసి, అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పంది నరేష్, సూర్కంటి మోహన్‌రెడ్డి, ఆడెపు రమేష్, అరూరి ప్రణీత్, కూరాకుల బాలు, గోలి సాయికుమార్, మేడి మనోజ్ కుమార్, మెరుగుమల్ల శ్రీకాంత్, అరూరి శివకుమార్, కంచుకోముల పవన్ తదితరులు పాల్గొన్నారు.