Morena Train Accident | రైల్వే ట్రాక్‌పై విషాదం.. భయమే శాపమైంది !!
Morena Train Accident | రైల్వే ట్రాక్‌పై విషాదం.. భయమే శాపమైంది !!
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్, Morena Train Accident : భయాందోళనల మధ్య తీసుకున్న క్షణిక నిర్ణయం నలుగురు ప్రాణాలను బలితీసుకుంది. రైలులో మంటలు చెలరేగాయనే ప్రచారం ప్రయాణికుల్లో భయాన్ని రేకెత్తించగా, ప్రాణాలు కాపాడుకోవాలనే ప్రయత్నంలో మరో రైలు కిందపడి నలుగురు మృతి చెందిన విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని మురైనా జిల్లా హేతంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. ఖజురాహో-ఉదయ్‌పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ జనరల్ కోచ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో రైలులో మంటలు అంటుకున్నాయనే రూమర్ ఒకటి వ్యాపించింది. దీంతో పలువురు ప్రయాణికులు ఆందోళనతో రైలు నుంచి దిగిపోయారు.
అయితే అదే సమయంలో పక్క ట్రాక్‌పై వస్తున్న ఫిరోజ్‌పూర్-సీవని పాతాళ్‌కోట్ ఎక్స్‌ప్రెస్‌ను గుర్తించకపోవడంతో పలువురు దాని కిందపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి సహా నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతులను అఫ్రీన్ (35), అసద్ (4), శకుంతలా (60), వీర్మా దేవి (58)గా గుర్తించారు. మరికొందరు గాయపడినట్లు సమాచారం.
అలారం చైన్ పుల్లింగ్ తర్వాత ఘటన
సాయంత్రం సుమారు 4.15 గంటలకు ఓ ప్రయాణికుడు అలారం చైన్ లాగడంతో ఖజురాహో-ఉదయ్‌పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ హేతంపూర్-ధౌల్పూర్ రైల్వే సెక్షన్‌లో నిలిచిపోయిందని ఉత్తర మధ్య రైల్వే వెల్లడించింది. రైలు ఆగిన సమయంలో కొంతమంది ప్రయాణికులు దిగిపోయి పక్క ట్రాక్‌పైకి వెళ్లినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న పాతాళ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు, పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, మంటలు చెలరేగాయి అనే రూమర్ ఎలా వ్యాపించిందనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
