Bungee jumping tragedy | అంతిమ యాత్రగా మారిన అడ్వెంచర్ ట్రిప్.. !
Bungee jumping tragedy | అంతిమ యాత్రగా మారిన అడ్వెంచర్ ట్రిప్.. !
- బంజీ జంపింగ్‌లో ఘోర ప్రమాదం
- థ్రిల్ కోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్, Bungee jumping tragedy : అడ్వెంచర్ స్పోర్ట్స్… ఉత్కంఠ, థ్రిల్, సాహసం కోసం ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది యువతను ఆకర్షిస్తున్న రంగం. బంజీ జంపింగ్, స్కైడైవింగ్, రాఫ్టింగ్, పారా గ్లైడింగ్ వంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ జీవితంలో ఒక్కసారైనా ట్రై చేయాలి చాలామంది కోరుకుంటారు. అయితే వీటిలో క్షణిక నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది. ఉత్సాహం క్షణాల్లో.. విషాదంగా మారుతుంది. భద్రతా ప్రమాణాల్లో చిన్న పొరపాటు జరిగినా దాని మూల్యం ప్రాణాలతో చెల్లించాల్సి వస్తుంది. తాజాగా బ్రెజిల్‌లో జరిగిన ఓ విషాదకర ఘటన మరోసారి అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో భద్రత ఎంత కీలకమో గుర్తుచేసింది.
బ్రెజిల్‌లోని సావో పాలో రాష్ట్రంలోని లిమెయిరా ప్రాంతంలో ఉన్న స్కెలిటన్ బ్రిడ్జ్ (Ponte do Esqueleto) వద్ద ఈ విషాదం జరిగింది. ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్‌లో పట్టభద్రురాలైన మరియా తన కాబోయే భర్తతో కలిసి రోప్ జంపింగ్ అడ్వెంచర్ పాల్గొనడానికి వెళ్లింది.
సాహసం చేయాలనే ఉత్సాహంతో బంగీ జంపింగ్‌కు సిద్ధమైన ఒక 21 ఏళ్ల యువతి, నిర్వాహకుల ఘోర నిర్లక్ష్యం కారణంగా క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయింది. దాదాపు 40 మీటర్ల (సుమారు 130 అడుగులు) ఎత్తు నుంచి కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా దూకించడంతో ఈ దారుణం జరిగింది (Bungee jumping tragedy). బ్రెజిల్‌లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన ప్రస్తుతం అంతర్జాతీయంగా సాహస క్రీడల భద్రతపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది.
అసలేం జరిగింది?
బ్రెజిల్‌లోని సావోపాలో రాష్ట్రం లిమేరా ప్రాంతంలో ఉన్న ‘పోంటే డో ఎస్కెలెటో’ బ్రిడ్జి సాహస క్రీడలకు ఎంతో ప్రసిద్ధి. శనివారం ఉదయం ఇక్కడికి వచ్చిన మారియా ఎడ్వార్డా రోడ్రిగ్స్ డి ఫ్రీటాస్ (21) అనే యువతి బంగీ జంపింగ్ చేయడానికి సిద్ధమైంది.
పోలీసుల కథనం ప్రకారం.. బంగీ జంప్ చేయడానికి ముందు యువతికి ప్రధానమైన భద్రతా తాడును (Safety Rope) సరిగ్గా అమర్చలేదు. అయితే, అది గమనించని నిర్వాహకులు ఆమెనుపై నుంచి కిందకు దూకించేశారు. ఆమె కిందపడిపోతుండటం చూసి అక్కడున్నవారు “తాడు.. తాడు!” అంటూ కేకలు వేసినా అప్పటికే ఘోరం జరిగిపోయింది. దాదాపు 40 మీటర్ల ఎత్తు నుంచి ఆమె నేరుగా కిందపడిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర వైద్య బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నా.. ఆమె అప్పటికే మృతి చెందింది.
“రోప్.. రోప్..” అంటూ అరుపులు..
జంప్‌కు ముందు సేఫ్టీ రోప్‌ను ఆమె బెల్ట్ కు బిగించడం నిర్వాహకులు మరిచిపోయారు. అయితే ఈ విషయం గుర్తించిన కొందరు అక్కడే “గైస్.. ది రోప్!” అంటూ హెచ్చరించినా అప్పటికే ఆలస్యమైపోయింది. ఇద్దరు సిబ్బంది ఆమెను ప్లాట్‌ఫామ్ నుంచి తోసేయగా, సుమారు 40 మీటర్ల లోతైన లోయలోకి పడిపోయింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి వారు సీపీఆర్ చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది.. ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు.

ప్రమాదానికి ముందే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్..
జంప్‌కు వెళ్లే ముందు మరియా తన సోషల్ మీడియా ఖాతాలో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసింది. “డేంజర్”, “రిస్క్ ఆఫ్ డెత్” అని హెచ్చరికలు ఉన్న బోర్డు ఫోటోను కూడా షేర్ చేసింది. అయితే, ఆమె మృతి చెందిన కొన్ని గంటలకే ఆ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్ అయినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ ప్రమాదాన్ని మరియా కాబోయే భర్త ప్రత్యక్షంగా చూశాడు. తీవ్ర మానసిక వేదనకు గురైన అతడిని అనంతరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు అధికారులు తెలిపారు.

అడవిలోకి పారిపోయిన నిర్వాహకులు..
ప్రమాదం అనంతరం కార్యక్రమాన్ని నిర్వహించిన సంస్థలకు చెందిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన అనంతరం ఇద్దరు సిబ్బంది అక్కడి నుంచి పారిపోగా, పోలీసు హెలికాప్టర్ సహాయంతో సమీప అటవీ ప్రాంతంలో వారిని గుర్తించి పట్టుకున్నారు. నిర్లక్ష్యం, హత్య (Negligence and Possible Homicide) కోణాల్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఓ యువతి ప్రాణాలు కోల్పోవడంతో భద్రతా ప్రమాణాల అమలుపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.
