మహిళల భద్రతే లక్ష్యం.. శక్తి అవగాహన కార్యక్రమం
మహిళల భద్రతే లక్ష్యం.. శక్తి అవగాహన కార్యక్రమం
ఎస్పీ సునీల్ షెయోరాన్ ఆదేశాలతో నందికొట్కూరులో అవగాహన
శక్తి యాప్ వినియోగంపై మహిళలకు సూచనలు
నందికొట్కూరు, ఆంధ్రప్రభ : మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నంద్యాల జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణంలోని మారుతీనగర్‌లో ఆదివారం శక్తి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్ షెయోరాన్ ప్రత్యేక ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ మార్గదర్శకత్వంలో, నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం సూచనల మేరకు టౌన్ యూపీఎస్ ఎస్‌ఐ సురేష్‌బాబు కార్యక్రమానికి నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మహిళల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, గృహహింస, బాల్య వివాహాలు, ఆమ్లదాడులు, లైంగిక వేధింపులు, మానభంగాలు, బెదిరింపులు వంటి ఘటనలపై అవగాహన కల్పించారు.
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెయోరాన్ మహిళల రక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని, జిల్లాలో ఎక్కడైనా మహిళలకు అన్యాయం జరిగితే వెంటనే స్పందించి బాధితులకు న్యాయం అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మహిళల భద్రత కోసం జిల్లా పోలీసు శాఖ నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందన్నారు.
ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, మాటలతో వేధించినా లేదా దాడులకు పాల్పడినా భయపడకుండా వెంటనే డయల్-100, 112 అత్యవసర నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. బాల్య వివాహాలు, పిల్లలపై నేరాలకు సంబంధించి 1098 చైల్డ్‌లైన్‌కు, మహిళా సంక్షేమానికి 181 మహిళా సహాయ కేంద్రానికి సమాచారం అందించాలని కోరారు.
ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన శక్తి యాప్‌ను ప్రతి మహిళ తమ మొబైల్‌లో తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఒక్క బటన్ నొక్కగానే పోలీసులకు సమాచారం చేరుతుందని, వెంటనే స్పందిస్తామని భరోసా ఇచ్చారు.
మహిళలపై దాడులను అరికట్టడం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం కూడా బాధ్యతగా భావించాలని సీఐ పేర్కొన్నారు. మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో శక్తి బృంద సభ్యులు నీతమ్మ, రసూల్, మారుతీనగర్ ఆర్‌పీటీ మాధవి, గృహిణులు, పొదుపు సంఘాల మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం పలువురు మహిళలు శక్తి యాప్‌ను తమ మొబైల్ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకున్నారు.
