నియోజకవర్గ కాంగ్రెస్ లో ముసలం?
నియోజకవర్గ కాంగ్రెస్ లో ముసలం?
- ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న నాయకులు
- చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి ,దమ్మపేట మండలాల నేతలు సిద్ధం
- అతి త్వరలో అన్నపురెడ్డిపల్లిలో సమావేశం
- ఇప్పటికే ఖరారైన పిసిసి చీఫ్ అపాయింట్మెంట్
- సీఎం అపాయింట్మెంట్ కోసం యత్నాలు
- ఒకటవుతున్న అసమ్మతినేతలు
అశ్వారావుపేట, ఆంధ్రప్రభ : నియోజకవర్గంలోని అన్నపురెడ్డిపల్లి వేదికగా అశ్వారావుపేట నియోజకవర్గం లోని కాంగ్రెస్ అసమ్మతి వాదులందరూ ఒకటవుతున్నారా అంటే అవుననే సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. గడిచిన వారం రోజుల క్రితమే ఈ సమావేశం నిర్వహించాల్సి ఉన్నా కొన్ని అనివార్య కారణాలవల్ల వాయిదా పడినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలోని చంద్రుగొండ ,అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట మండలాల్లోని నేతలు తో పాటుగా అశ్వారావుపేట ,ములకలపల్లి మండలాల్లోని అసమ్మతి నాయకులు కూడా కలిసి ఈ సమావేశంలో పాలుపంచుకోనున్నట్లు సమాచారం.
నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే ఆయన అనుచర వర్గం ఒంటెద్దు పోకడలతో విసిగిపోయిన నాయకులు ఈ సమావేశం నిర్వహించడానికి సన్నద్ధమైనట్లు నియోజకవర్గ వ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశమైంది. దీనికిగాను అన్నపురెడ్డిపల్లి మండలానికి చెందిన ఓ సీనియర్ నాయకుడు పూర్తి బాధ్యతలు వహిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా వచ్చిన సమాచారం బట్టి తెలుస్తుంది. సదరు నేతలు ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అపాయింట్మెంట్ ఖరారు చేసుకోగా, గత కొద్ది రోజులుగా సీఎం అపాయింట్మెంట్ కోసం కూడా వీరు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని సన్నాహాక కార్యక్రమం అతి త్వరలోనే అన్నపురెడ్డిపల్లి లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
నామినేటెడ్ పదవుల ఎంపికలో వ్యత్యాసం, అలాగే పార్టీ పదవుల్లో కూడా ఒక వర్గానికి పదవులు దక్కటం, వర్కులలో కూడా పూర్తిగా పాత కొత్త తారతమ్యాలు చూపించి నియోజక వ్యాప్తంగా దూరంగా ఉంచుతున్న పరిస్థితులు కనబడటంతో రెండున్నర సంవత్సరాలు పాటు వేచి చూసిన నాయకులు ఇక ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుందని గ్రహించి ఎమ్మెల్యే పై బహిరంగ పోరాటానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా గత నెల 29న గాంధీభవన్ లో జరిగిన పీఏసీ(పొలిటికల్ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో సాక్షాత్తు సీఎం ఎమ్మెల్యేల పనితీరు అస్తవ్యస్తంగా ఉందని పనితీరు మార్చుకోవాలని సమావేశ వేదికగానే ప్రస్తావించిన విషయం పాఠకులకు విదితమే.
సమావేశంలో అశ్వారావుపేట నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు కూడా ఎనిమిది నిమిషాల పాటు చర్చకి వచ్చినట్లు అధికారిక సమాచారం. నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం చేయడంలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని ఒక వర్గానికి పూర్తిస్థాయిలో కొమ్ముకాస్తున్నారని ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది. దానికి తగిన ఆధారాలను కూడా సమావేశంలో పలువురు నేతలు అధిష్టానం ముందు పెట్టినట్లు సమాచారం.
వీటన్నిటిని కూలంకుషంగా క్రోడీకరించిన అనంతరం సీఎం మాట్లాడుతూ ఏ ఒక్క ఎమ్మెల్యే పేరును ప్రస్తావించకుండా అందరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలని లేకపోతే రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించటం బహిరంగంగా అందరూ చూసిందే. దీంతో నియోజకవర్గ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు ఏ వైపుకు దారితీస్తాయోనని పార్టీలోనే కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
