వైసీపీది విధ్వంసం..

వైసీపీది విధ్వంసం..

కూటమి ప్రభుత్వానిది సమగ్ర వికాసం

రెండేళ్ల పాలనలో అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతున్నాయన్న టీడీపీ నేతలు

చల్లపల్లి, ఆంధ్రప్రభ : వైసీపీ పాలన విధ్వంసానికి ప్రతీక అయితే, కూటమి ప్రభుత్వ పాలన సమగ్ర వికాసానికి నిదర్శనమని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా చల్లపల్లిలోని ఎన్టీఆర్ పార్కులో ఆదివారం పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంటే, వైసీపీ విద్వేష రాజకీయాలకు పాల్పడిందని విమర్శించారు. మెగా డీఎస్సీ, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, అధికార రాజకీయాల కోసం సొంత కుటుంబ సభ్యులకే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.

రాజకీయంగా అవకాశాలు కల్పించిన కాంగ్రెస్ పార్టీని కూడా వదలకుండా వ్యవహరించిన చరిత్ర జగన్‌మోహన్‌రెడ్డిదేనని అన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తుంటే, దానిపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు గత పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నారని, అలాంటి పరిస్థితిని జీర్ణించుకోలేక వైసీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు మరోసారి వారికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మోర్ల రాంబాబు, డీసీసీ చైర్మన్ నిడమానూరి దిలీప్‌కుమార్, కూటమి నాయకులు షేక్ నబీఘోరి, మేకా వెంకటేశ్వరరావు, దిరిశం వెంకట్రావు, బుల్లా కిషోర్, ప్రెస్ పూర్ణ, గంగిశెట్టి రాజేంద్ర, తాతా ప్రదీప్, మల్లంపల్లి శివరామకృష్ణ, పెనుమాక శ్రీనివాసరావు, మట్టా రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.