కేంద్ర, రాష్ట్రాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం
కేంద్ర, రాష్ట్రాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం
- గత ప్రభుత్వ మూర్ఖత్వంవల్ల తెలంగాణకు నష్టం
- కేంద్రం నుండి నిధులొస్తున్నాయి
- 7 ఏళ్లలో రూ.22 వేల కోట్ల నిధులు తీసుకొచ్చా
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
వేములవాడ, ఆంధ్రప్రభ : రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. అట్లనే కేంద్రం, రాష్ట్రం కలిస్తేనే అభివ్రుద్ధి సాధ్యమని గత ప్రభుత్వ మూర్ఖపు పాలనవల్ల తెలంగాణ చాలా నష్టపోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పార్టీ సంజయ్ కుమార్ తెలియజేశారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం బొల్లారంలో రోడ్డు విస్తరణ పనులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తున్నందువల్లే కేంద్రం నుండి నిధులొస్తున్నాయన్నారు. గ్రామాలకు మండలానికి కనెక్ట్ చేసేలా తగిన నిధులొస్తున్నాయని, గత ఏడేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం రూ.22 వేల కోట్ల నిధులు తీసుకొచ్చానన్నారు.
కలిసి పనిచేస్తేనే అభివృద్ధి..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివ్రుద్ధి సాధ్యం. ఎన్నికల వరకే రాజకీయాలు. ఎన్నికల తరువాత గెలిపించిన ప్రజల కోసం నియోజకవర్గాల అభివ్రుద్ధే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. గత 7 ఏళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివ్రుద్ధి కోసం 22 వేల కోట్లకుపైగా కేంద్ర నిధులు తీసుకొస్తే, అందులో రోడ్ల నిర్మాణం కోసమే 10 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు ఖర్చు చేసినం. అందులో భాగంగా మేడిపల్లి గోవిందారం, మల్యాల నుండి కాచారం రోడ్ల విస్తరణ పనులకు 45 కోట్ల రూపాయలు ఖర్చు చేసి విస్తరించాం.
కేవలం జాతీయ రహదారుల విస్తరణ కోసమే 5 వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చినం. దీంతోపాటు సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, జాతీయ ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి మిగిలిన నిధులు తీసుకొచ్చి ఖర్చు చేస్తున్నం. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో ఎంపీగా పనిచేసిన ఏ నాయకుడు కూడా ఈ స్థాయిలో నిధులు తీసుకువచ్చిన దాఖలాలు లేవు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం. కలిసి రావాలని అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులను, నాయకులను కోరుతున్నా.
