11 సీట్ల తీర్పు మరిచిన జగన్….
11 సీట్ల తీర్పు మరిచిన జగన్….
అమరావతిపై ఇంకా విషం కక్కుతూనే!
మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : అమరావతి రాజధానిగా రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చి జగన్ ను 11 సీట్లకు పరిమితం చేసినప్పటికీ రాజధానిపై ఇంకా విషం కక్కుతూనే ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న విమర్శించారు. ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పును అంగీకరించకుండా అమరావతి అంశంపై నిరాధార ఆరోపణలు చేస్తూ విషం కక్కుతున్నారని మండిపడ్డారు. జగన్ ప్రెస్మీట్లలో మాట్లాడుతున్న తీరు చూస్తే వాస్తవాలకు పూర్తిగా దూరంగా ఉన్నట్లు స్పష్టమవుతుందని వెంకన్న అన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి దారి నుంచి తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినప్పటికీ ఆయన వైఖరిలో మార్పు కనిపించడం లేదని విమర్శించారు. అమరావతి రాజధాని అంశాన్ని ప్రస్తావిస్తూ, సీఎం చంద్రబాబు పై నమ్మకంతో రైతులు వేల ఎకరాల భూములు స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తుచేశారు. జగన్ పాలనలో అలాంటి విశ్వాసం ఎక్కడా కనిపించలేదని అన్నారు. అమరావతిని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసి రైతుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు.
మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టారని, ఇప్పుడు అమరావతి చట్టబద్ధంగా ముందుకు సాగుతుంటే తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారని వెంకన్న వ్యాఖ్యానించారు. రాజధాని అనేది రాష్ట్ర పాలనకు కేంద్రబిందువని, దానిని తక్కువ చేసి మాట్లాడడం తగదని స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధి, రాష్ట్ర ప్రగతిపై తాము ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించిన వెంకన్న, జగన్ ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు.
గత ఐదేళ్లలో అమరావతిని నిర్లక్ష్యం చేసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. జగన్ ఇప్పటికైనా తప్పుడు ప్రచారాన్ని మానుకుని ప్రజల తీర్పును గౌరవించాలని సూచించారు.
