మేదరి మహేంద్ర కులానికి డిఎన్టిగా గుర్తింపు..
ఇచ్చోడ, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ నెం.10 ద్వారా మేదరి మహేంద్ర కులాన్ని డి-నోటిఫైడ్, నోమాడిక్, సెమీ నోమాడిక్ (డీఎన్టీ) కమ్యూనిటీల జాబితాలో అధికారికంగా చేర్చడాన్ని తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర సహాయ ప్రచార కార్యదర్శి పిల్లి నరేష్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేదరి మహేంద్ర సమాజ అభివృద్ధికి చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఈ గుర్తింపుతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సీడ్’ (SEED) పథకంతో పాటు డి-నోటిఫైడ్, నోమాడిక్, సెమీ నోమాడిక్ కమ్యూనిటీల కోసం అమలవుతున్న పలు సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
అలాగే విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో ప్రత్యేక అవకాశాలు లభించడంతో పాటు సామాజిక, ఆర్థిక సాధికారతకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు వెనుక తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం చేపట్టిన నిరంతర పోరాటం, ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులు, సమాజ ప్రతినిధుల కృషి కీలక పాత్ర పోషించాయని తెలిపారు.
మేదరి కుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జర్రిగల శ్రీనివాస్ సేవలను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. బీసీ-ఏ గ్రూపులోని 49 కులాల్లో రెండు కులాలను గుర్తించి డీఎన్టీ జాబితాలో చేర్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నో సంవత్సరాలుగా కొనసాగిన తమ పోరాటానికి ఫలితం దక్కిందని, మేదరి మహేంద్ర సమాజాన్ని గుర్తించి ప్రత్యేక అవకాశాలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి తాము రుణపడి ఉంటామని పిల్లి నరేష్ పేర్కొన్నారు.
