సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి

సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి

ఓటర్ల జాబితా సవరణలో బీఎల్‌ఏలు కీలక పాత్ర పోషించాలి

అక్రమ తొలగింపులు, అవకతవకలను అడ్డుకోవాలని దేవినేని అవినాష్ పిలుపు

విజయవాడ, ఆంధ్రప్రభ: ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు.

ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన అంశమని పేర్కొన్నారు. ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు అక్రమాలు, అవకతవకలు, అన్యాయమైన ఓటర్ల తొలగింపులు జరగకుండా బీఎల్‌ఏలు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అనుమానాస్పద మార్పులు లేదా అక్రమాలు గుర్తించిన వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రతి అర్హుడైన వ్యక్తి ఓటు హక్కును కాపాడే బాధ్యతతో పనిచేయాలని అవినాష్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో బీఎల్‌ఏల పాత్ర అత్యంత కీలకమని, పార్టీ శ్రేణులందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఓటర్ల హక్కులను కాపాడేందుకు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Leave a Reply