ఘనంగా మోహనరంగా జయంతి వేడుకలు

భవానిపురం, జూలై 4 (ఆంధ్రప్రభ): స్వర్గీయ వంగవీటి మోహనరంగా పేద ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న మహానేత అని ఆయన తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు. శనివారం విద్యాధరపురంలోని వి.ఎం. రంగా జంక్షన్ సొరంగం డౌన్ వద్ద వి.ఎం. రంగా విగ్రహ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో కాపు నాయకులు మైలవరపు దుర్గారావు, మైలవరపు కృష్ణ పర్యవేక్షణలో రంగా 79వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ పేదల కోసం జీవితాంతం పోరాడిన నాయకుడు రంగా అని కొనియాడారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అలాంటి మహానేతకు కుమారుడిగా పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని భావోద్వేగానికి గురయ్యారు.

ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిన నాయకుడు వంగవీటి మోహనరంగా అని అన్నారు. ఆయన ఆశయాలు, సేవా భావం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రజల కోసం అంకితభావంతో పనిచేసిన నాయకులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు పంచకర్ల సందీప్, నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ కె. నాగుల్ మీరా, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఎస్. బేగ్, జనసేన రాష్ట్ర నాయకులు అమ్మిశెట్టి వాసు, పారిశ్రామికవేత్త గునుకుల పుల్లయ్య, మిరియాల వెంకటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి, మహదేవు అప్పాజీరావు, మరుపిళ్ల రాజేష్, ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి), గుడివాడ నరేంద్ర రాఘవ, జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్, జనసేన నాయకులు పెనుగొండ సుబ్బారాయుడు, లింగం శివప్రసాద్, కేఎస్‌ఎన్ మూర్తి, అక్కల గాంధీ, సంభన బాబురావు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో రంగా అభిమానులు పాల్గొన్నారు.