ప్రధాని రాకకు పకడ్బందీ ఏర్పాట్లు.. భోగాపురంలో మంత్రుల సమీక్ష

భోగాపురం, ఆంధ్రప్రభ: భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై నేడు మంత్రులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో భోగాపురంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, డోలా బాల వీరాంజనేయస్వామి, కొలుసు పార్థసారథి, విజయనగరం జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ పాల్గొనే భారీ బహిరంగ సభకు వచ్చే ప్రజలు, నాయకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

సభకు హాజరయ్యే లక్షలాది మంది కోసం తాగునీరు, ఆహార వసతులు అందుబాటులో ఉంచాలని, వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలుస్తుందని, ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.