INDvsAFG-ODI | టీమిండియా జయభేరి
INDvsAFG-ODI | టీమిండియా జయభేరి
- కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిసిన శుభ్‌మన్ గిల్..
ఆంధ్రప్రభ : ధర్మశాల వేదికగా ఆఫ్ఘాన్ తో తొలి వన్డేలో (INDvsAFG-ODI) భారత్ 7 వికెట్ల తేడాతో ఆఫ్ఘానిస్థాన్‌ను ఓడించింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.
వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ వన్డేలో.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడుతూ 66 బంతుల్లో 84 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు కేఎల్ రాహుల్ కేవలం 19 బంతుల్లోనే 39 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. రాహుల్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.

ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ శుభారంభం అందించారు. రోహిత్ 16 బంతుల్లో 16 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. అనంతరం ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడుతూ 22 బంతుల్లో 34 పరుగులు చేశాడు. గిల్‌తో కలిసి రెండో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు ఇషాన్ కిషన్. శ్రేయస్ అయ్యర్ 12 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ, గిల్-రాహుల్ జోడీ నాలుగో వికెట్‌కు అజేయంగా 53 పరుగులు జోడించి విజయాన్ని ఖాయం చేసింది.
గర్బాజ్ సెంచరీ వృథా…
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘానిస్థాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రహ్మానుల్లా గర్బాజ్ 51 బంతుల్లో 102 పరుగులతో చెలరేగినా, మిగతా బ్యాటర్లు విఫలమవడంతో భారీ స్కోరు చేయలేకపోయింది.
డెబ్యూ బౌలర్ల సూపర్ షో
భారత్ తరఫున అరంగేట్రం చేసిన హర్ష్ దూబే (3/47), గుర్నూర్ బ్రార్ (3/27) తలో మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నారు. అర్ష్‌దీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి చెరో రెండు వికెట్లు సాధించారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది.
