బంటారం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎస్పీ

బంటారం, ఆంధ్రప్రభ : బంటారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను శనివారం వికారాబాద్ డీఎస్పీ అంజయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించిన ఆయన, వివిధ అంశాలపై స్థానిక ఎస్సై విమలను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం మండలంలోని రౌడీషీటర్లు, అనుమానిత వ్యక్తులను పిలిపించి వారి ప్రవర్తన గురించి ఆరా తీశారు. సమాజంలో బాధ్యతాయుతంగా, మంచి ప్రవర్తనతో ఉండాలని వారికి సూచించారు.

ఈ సందర్భంగా సీఈఐఆర్ (CEIR) పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి, బాధితులకు తిరిగి అందజేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై విమలతో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.