చీ.. చీ.. కంపు కొడుతున్న మేడ్చల్ సర్కిల్..

స్కూల్ ముందే మురికినీటి నరకం

ప్రభుత్వ బాలికల పాఠశాల ఎదుట ఏరులై పారుతున్న డ్రైనేజీ..

అధికారులు స్పందించాలని స్థానికుల డిమాండ్

మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) మేడ్చల్ సర్కిల్ పరిధిలో పారిశుద్ధ్య సమస్యలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. ముఖ్యంగా మేడ్చల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ద్వారం ఎదుట భూగర్భ డ్రైనేజీ లీకై మురికినీరు ఏరులై పారుతుండటంతో విద్యార్థినులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముక్కు మూసుకుని పాఠశాలకు..

పాఠశాల పరిసరాలు మురికినీరు, చెత్తాచెదారంతో నిండిపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థినులు మురికినీటిని దాటుకుంటూ పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దుర్వాసన, అపరిశుభ్ర వాతావరణం కారణంగా పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురవుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో అంటువ్యాధుల ముప్పు కూడా పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

వినతులు చేసినా ఫలితం లేదు

డ్రైనేజీ సమస్యపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు పలుమార్లు సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కూడా రోడ్లపై మురికినీరు పారుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

కమిషనర్ జోక్యం చేసుకోవాలంటున్న ప్రజలు

మున్సిపల్ అధికారులు, సంబంధిత శాఖలు ఇప్పటికైనా స్పందించి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా మార్చి విద్యార్థినులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని, ఈ విషయంలో సీఎంసీ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.