నిర్మల్‌లో ఎల్వీ ప్రసాద్ కంటి పరీక్ష కేంద్రం ప్రారంభం
నిర్మల్‌లో ఎల్వీ ప్రసాద్ కంటి పరీక్ష కేంద్రం ప్రారంభం
- ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
నిర్మల్ ప్రతినిధి , ఆంధ్రప్రభ : ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో నిర్మల్ పట్టణంలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ – కూచాడి సత్యమ్మ ప్రకాశ్‌రావు కంటి పరీక్ష కేంద్రాన్ని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నిర్మల్‌లోనే కంటి పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పించడం సంతోషకరమన్నారు. ఈ కేంద్రం ద్వారా ప్రారంభ దశలోనే కంటి సంబంధిత సమస్యలను గుర్తించి తగిన వైద్యం పొందవచ్చని తెలిపారు.
క్లిష్టతరమైన నేత్ర సమస్యలు ఉన్నవారు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి నిపుణుల సేవలను పొందేలా ఈ కేంద్రం వారధిగా పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను చేరువ చేయడంలో ఇటువంటి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో కూచాడి శ్రీహరి రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్, ఇతర ప్రజాప్రతినిధులు, వైద్యులు, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
