Vijayawada వడ్డెర సొసైటీలకు గ్రావెల్ తవ్వకాలకు అనుమతి..

Vijayawada వడ్డెర సొసైటీలకు గ్రావెల్ తవ్వకాలకు అనుమతి..

పారదర్శక ఇసుక సరఫరాకు కట్టుదిట్ట చర్యలు: కలెక్టర్ లక్ష్మీశ

విజయవాడ (Vijayawada), ఆంధ్రప్రభ: జిల్లాలో వడ్డెర కులస్థుల ఆర్థికాభివృద్ధికి అనుగుణంగా అర్హత కలిగిన వడ్డెర సొసైటీల ద్వారా గ్రావెల్, కంకర తవ్వకాలకు అనుమతులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లోని ఎ.వి.ఎస్. రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ ఇసుక సరఫరా, వడ్డెర సొసైటీల ద్వారా తవ్వకాల విధానంపై సమీక్ష నిర్వహించారు.

కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వడ్డెర సొసైటీలకు ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. జీవో నెం.90 ప్రకారం 50 శాతం రాయితీతో మెటల్, గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలంలో ఆరు, విజయవాడ రూరల్‌లో రెండు కలిపి మొత్తం తొమ్మిది వడ్డెర సొసైటీలు ఉన్నాయని వివరించారు.

ప్రతి సొసైటీలో కనీసం 25 మంది సభ్యులు ఉండాలనే నిబంధనను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అర్హత కలిగిన సొసైటీలు దరఖాస్తు చేసుకుంటే నిబంధనల మేరకు అనుమతులు జారీ చేస్తామని తెలిపారు. ఇసుక సరఫరా వ్యవస్థను పూర్తిగా పారదర్శకంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ సహకారంతో పటిష్ట నిఘా కొనసాగుతుందని తెలిపారు.

జిల్లాలో ప్రస్తుతం తొమ్మిది రీచ్‌ల ద్వారా ఇసుక సరఫరా జరుగుతోందని, సుమారు 4.48 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని చెప్పారు. జగ్గయ్యపేట వద్ద కృష్ణానదిలో మేట వేసిన ఇసుక తొలగింపునకు అనుమతులు ఇవ్వాలనే అంశంపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పరిటాల, జి.కొండూరు మండలాల పరిధిలో క్రషర్ యూనిట్లకు కూడా అనుమతులు ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మైన్స్ డీడీ శ్రీనివాస్ కుమార్, ఇతర శాఖల అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.