Singur Reservoir | జలాశయం ముంపు ప్రాంతంలో భూకబ్జాలు
Singur Reservoir | జలాశయం ముంపు ప్రాంతంలో భూకబ్జాలు
- అధికార కాంగ్రెస్ అరాచక పాలన
- విషతుల్యమవుతున్న ప్రజల జీవనాడి
- అధికారులూ అక్రమాల్లో భాగస్వాములే!
- నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి జిల్లా ప్రజల జీవనాడిగా, కోట్లాది మందికి తాగునీరు, సాగునీరు అందించే సింగూరు జలాశయం (Singur Reservoir) అధికార పార్టీ నేతల అక్రమ సంపాదనకు అడ్డాగా మారిందని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మండిపడ్డారు.
మంత్రి దామోదర రాజనర్సింహ అనుచరులు, ఆయన బామ్మర్ది, పీఏల కనుసన్నల్లో సింగూరు ముంపు ప్రాంతంలో భూకబ్జాలు, అక్రమ చేపల చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయని మారోసారి ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. వాటికి సంబంధించిన వీడియో ఆధారాలను శుక్రవారం మీడియాకు విడుదల చేశారు.
ఈ సందర్భంగా క్రాంతి కిరణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆందోల్ నియోజకవర్గంలో పాలనా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని, ప్రజా ప్రభుత్వం నడుస్తోందా లేక మంత్రి అనుచరుల ప్రైవేట్ మాఫియా పాలన సాగుతోందా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని తీవ్రంగా విమర్శించారు.
అధికార యంత్రాంగం దాసోహం సాయిపేట్, కాదిరాబాద్ ముంపు ప్రాంతాల్లో మంత్రి బామ్మర్ది ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలు జరుగుతుండగా, నిర్జీప్లా, భూత్కూర్, దేవనూర్, కాదిరాబాద్ గ్రామాల పరిధిలో మంత్రి ముఖ్య అనుచరులు ప్రభుత్వ అనుమతులు లేకుండానే ముంపు భూములను ఆక్రమించి చేపల చెరువులు తవ్వుతున్నారని ఆరోపించారు.
ఈ వ్యవహారంలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పూర్తిగా అధికార పార్టీ నేతలకు దాసోహమయ్యారని ఆయన విమర్శించారు.
అధికారులూ భాగస్వాములేనని
అధికారుల పూర్తి సహకారం లేకుండా ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరగడం సాధ్యం కాదని, ఈ దోపిడీలో వారు కూడా భాగస్వాములుగా ఉండటం వల్లే నిమ్మకు నీరెత్తినట్టు నటిస్తున్నారని క్రాంతి కిరణ్ విమర్శించారు. సింగూరును ఖాళీ చేసింది మరమ్మతుల కోసమా.. అక్రమ దందాల కోసమా? అంటూ నిప్పులు చెరిగారు.
సింగూరు ప్రాజెక్టును మరమ్మతుల పేరిట ఖాళీ చేసి, సాగునీటి అవసరాలను పక్కనబెట్టి మంత్రి అనుచరులకు అక్రమ చేపల చెరువులు తవ్వుకునే అవకాశం కల్పించడాన్ని ఆయన తప్పుబట్టారు. నీటి మట్టం తగ్గిన సమయంలో రైతులు తమ భూముల్లో పంటలు సాగు చేసుకోవాల్సి ఉండగా, కాంగ్రెస్ నాయకులు మాత్రం ముంపు భూములను థర్డ్ పార్టీలకు అద్దెకు ఇచ్చి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారని విమర్శించారు.
తాగునీరు కలుషితం.. ప్రశ్నిస్తే బెదిరింపులా?
అక్రమ చేపల చెరువుల్లో నాన్‌వెజ్ వ్యర్థాలు, రసాయనాలను వినియోగించడం వల్ల హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలకు తాగునీరు అందించే సింగూరు జలాశయం కలుషితమవుతోందని, ఇది తీవ్రమైన పర్యావరణ విధ్వంసానికి దారితీస్తోందని ఆయన అన్నారు.
ఈ అక్రమాలను స్థానిక ప్రజలు, రైతులు ప్రశ్నిస్తే స్థానిక సీఐ అండతో బెదిరింపులకు పాల్పడుతున్నారని, ప్రజలను రక్షించాల్సిన పోలీసులే అధికార పార్టీ నేతల దౌర్జన్యాలకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.
మంత్రి అనుచరులు చేపట్టిన అక్రమ చేపల చెరువులను వెంటనే తొలగించాలని, ఈ వ్యవహారానికి సహకరించిన ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులపై ఉన్నతస్థాయి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు.
