Tragic incident | రూ.12 లక్షలు పోగొట్టుకుని యువకుడి ఆత్మహత్య

Tragic incident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వ్యసనం మరో యువ ప్రాణాన్ని బలితీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎం.ఆర్. కాలనీలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.

కాలనీకి చెందిన క్రాంతి అనే యువకుడు గత ఆరు నెలలుగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైనట్లు సమాచారం. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో తెలిసినవారి వద్ద, బయట వ్యక్తుల వద్ద పెద్ద మొత్తంలో అప్పులు చేసి బెట్టింగ్‌లు ఆడాడు. అయితే వరుస నష్టాలతో ఏకంగా రూ.12 లక్షల వరకు పోగొట్టుకున్నాడు.

అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన క్రాంతి, స్థానిక ఇందిరానగర్ చర్చి వెనుక భాగంలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.