నిబంధనలు పాటించకపోతే వారిపై కేసులు: బాసర సీఐ
నిబంధనలు పాటించకపోతే వారిపై కేసులు: బాసర సీఐ
బాసర (నిర్మల్ జిల్లా): మండల పరిధిలోని సావర్గావ్ గ్రామంలో బుధవారం పోలీసుల ఆధ్వర్యంలో ‘అలైవ్ అరైవ్’ (Alive Arrive) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ దీపక్ గ్రామస్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మద్యం తాగి బైక్ లేదా కార్లు నడపడం ప్రమాదకరమని, ఎట్టిపరిస్థితుల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని స్పష్టం చేశారు.
ముఖ్యంగా మైనర్లకు తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలను ఇవ్వకూడదని, ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి మైనర్లు వాహనాలు నడిపితే వారి తండ్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఐ కఠినంగా హెచ్చరించారు. బైక్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, వాహనానికి సంబంధించిన సరైన పత్రాలను ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోవాలని సూచించారు. వీటితో పాటు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును పాడుచేసుకోవద్దని పిలుపునిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పోలీసులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
