HBD NBK | వయసు 66.. ఎనర్జీ మాత్రం 26!

HBD NBK | వయసు 66.. ఎనర్జీ మాత్రం 26!

  • బాలయ్యను మాస్ గాడ్‌గా మార్చిన 5 దశాబ్దాల అద్భుత ప్రయాణం

ఆంధ్ర‌ప్ర‌భ‌ : నటసింహం. గాడ్ ఆఫ్ మాసెస్. నందమూరి బాలకృష్ణ (NBK). తెలుగు సినిమా చరిత్రలో ఈ పేరు ఒక బ్రాండ్. ఒక ఎనర్జీ. ఒక ఎమోషన్. తరాలు మారినా.. హీరోలు మారినా.. ట్రెండ్లు మారినా.. బాలయ్య క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. 50 ఏళ్లకు పైగా సినీ ప్రస్థానం.. 100కి పైగా సినిమాలు.. ఎన్నో ఇండస్ట్రీ హిట్లు.. లక్షలాది మంది అభిమానులు.. రాజకీయాల్లో సక్సెస్.. సేవా కార్యక్రమాల్లో అంకితభావం.. ఇలా ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేసిన వ్యక్తి బాలకృష్ణ.

ప్రతి సంవత్సరం జూన్ 10 వస్తుందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం కనిపిస్తుంది. భారీ కటౌట్లు, కేక్ కటింగ్‌లు, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, పేదలకు సహాయ కార్యక్రమాలు, థియేటర్లలో ప్రత్యేక ప్రదర్శనలు.. ఇలా అభిమానులు బాలయ్య పుట్టినరోజును వేడుకగా జరుపుకుంటారు. సోషల్ మీడియాలో #HappyBirthdayNBK, HBD NBK ట్రెండ్ కావడం ఆనవాయితీగా మారిపోయింది.

NBK

అదేవిధంగా, అకేషన్ ఏదైనా… సినిమా ఎవరిదైనా… పబ్ అయినా, పెళ్లి వేడుకైనా, కాలేజ్ ఫెస్ట్ అయినా, క్రికెట్ స్టేడియం అయినా… డీజే సాంగ్స్ మధ్యలో ఒక్కసారైనా మారుమోగే నినాదం “జై బాలయ్య!”. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ నినాదానికి సినిమా, రాజకీయాలు, అభిమాన సంఘాలు అనే హద్దులు కూడా లేవు.

ఇది కేవలం ఒక హీరో పేరు కాదు. అభిమానుల ఎమోష‌న్. ఒక ఎనర్జీ. సెలబ్రేషన్ కి ఒక‌ సింబల్. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడ చేరినా ఉత్సాహాన్ని రెట్టింపు చేసే పదంగా “జై బాలయ్య” మారిపోయింది. ఎలాంటి ప్లేస్ లో అయినా.. ఈ నినాదం వినిపించడం బాలయ్యకు ఉన్న ప్రత్యేకమైన క్రేజ్‌కు నిదర్శనం.

కాగా, జూన్ 10న బాలయ్య తన 66వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా.. ఒక బాలనటుడి నుంచి తెలుగు సినీ పరిశ్రమలో “మాస్ గాడ్”గా ఎదిగిన ఆయన అద్భుత ప్రయాణాన్ని మరోసారి గుర్తు చేసుకుందాం.

14 ఏళ్ల వయసులో మొదలైన ప్రయాణం..

తండ్రి, తెలుగు జాతి గర్వకారణం ఎన్టీఆర్ వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ.. మొదట్లో ఒక స్టార్ కిడ్‌గానే కనిపించాడు. కానీ కాలక్రమంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సృష్టించుకున్నాడు. 1974లో వచ్చిన తాతమ్మకల సినిమాతో బాలనటుడిగా కెమెరా ముందుకొచ్చిన బాలయ్య.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.

హీరోగా, మాస్ స్టార్‌గా, లెజెండ్‌గా ఎదిగిన ప్రయాణం తెలుగు సినిమా చరిత్రలో ఒక అధ్యాయం. బాలకృష్ణ పేరు వినగానే మాస్ డైలాగులు, పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. కానీ ఆయన వ్యక్తిత్వంలో మరో కోణం కూడా ఉంది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా వేలాది మంది పేషంట్ల‌కు సేవలు అందిస్తున్నారు.

రాజకీయాల్లో హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తున్నారు. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ కూడా అందుకున్నారు. తెరపై ఎంత అగ్రెసివ్‌గా కనిపించినా.. నిజ జీవితంలో సేవా కార్యక్రమాల విషయంలో ఎంతో సున్నితమైన వ్యక్తిగా పేరుంది. ప్రతి స్టార్ హీరో కెరీర్‌లో కొన్ని మైలురాయి చిత్రాలు ఉంటాయి.

బాలయ్య విషయంలో ఆ జాబితా చాలా పెద్దది. మంగమ్మగారి మనవడు ఆయనను ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర చేసింది. ఆదిత్య 369 ఆయనలోని ప్రయోగాత్మక నటుడిని చూపించింది. భైరవద్వీపం ఫాంటసీ జానర్‌లో ఆయన స్థాయిని పెంచింది. అయితే సమరసింహారెడ్డి తెలుగు సినిమాకు ఫ్యాక్షన్ యుగాన్ని పరిచయం చేస్తూ బాలయ్యను మాస్ సింహాసనంపై కూర్చోబెట్టింది.

నరసింహనాయుడు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. కెరీర్‌లో ఒక దశలో వరుస ఫ్లాప్‌లు ఎదురైనా.. సింహాతో తిరిగి గర్జించాడు బాల‌య్య‌. లెజెండ్ తో మరోసారి తన బాక్సాఫీస్ శక్తిని నిరూపించాడు. ఇటీవల అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో యువ హీరోలకు సైతం పోటీగా నిలిచాడు.

సినిమా ఇండస్ట్రీలో హీరోలు చాలా మంది వస్తారు… కొందరు సూపర్ స్టార్లు అవుతారు… ఇంకొందరు లెజెండ్స్‌గా నిలిచిపోతారు. కానీ తరాలు మారినా, ట్రెండ్లు మారినా, అభిమానుల హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుని, తన పేరునే ఒక నినాదంగా మార్చుకున్న హీరోలు మాత్రం చాలా అరుదు. తెలుగు సినిమా చరిత్రలో అలాంటి అరుదైన వ్యక్తిత్వం మ‌న‌ నందమూరి బాలకృష్ణ.

66 ఏళ్ల వయసులోనూ యువ హీరోలకు ఏమాత్రం తీసిపోని ఎనర్జీ, తెరపై కనిపించిన ప్రతిసారీ అభిమానుల్లో పూనకాలు తెప్పించే స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ చెబితే థియేటర్లు దద్దరిల్లిపోయే మాస్ ఇమేజ్… ఇవన్నీ బాలయ్యను ప్రత్యేకంగా నిలబెట్టాయి.

బర్త్‌డే గిఫ్ట్‌గా ఏమి రాబోతోంది?

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. NBK 111, NBK 112 చిత్రాలపై వస్తున్న అప్‌డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలయ్య కెరీర్‌లో మరో సువర్ణ అధ్యాయానికి నాంది పలికేలా ఈ రెండు చిత్రాలు రూపొందుతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.

NBK 111: గోపీచంద్ మలినేనితో మరోసారి గర్జించనున్న బాలయ్య

వీరసింహారెడ్డి వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి చేతులు కలిపిన చిత్రం NBK 111. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా, మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ ఇటీవల ఇచ్చిన సంకేతాల ప్రకారం టీజర్‌కు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్ పనులు పూర్తయ్యాయి. దీంతో బాలయ్య పుట్టినరోజు సందర్భంగా టీజర్ లేదా గ్లింప్స్ విడుదల చేసే అవకాశాలపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

NBK

NBK 112: కొరటాల శివతో తొలి కాంబినేషన్

బాలకృష్ణ కెరీర్‌లో తొలిసారి దర్శకుడు కొరటాల శివతో జతకడుతున్న ప్రాజెక్ట్ NBK 112. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ విడుదల చేసిన ట్యాగ్‌లైన్ “Power Meets Purpose.. Mass Becomes a Movement” ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. సామాజిక సందేశంతో కూడిన మాస్ యాక్షన్ కథాంశాన్ని కొరటాల శివ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రానికి సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు. బాలయ్య ఎనర్జీ, కొరటాల శివ మార్క్ ఎమోషన్, అనిరుధ్ మ్యూజిక్ కలిసి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టే అవకాశముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

వివేక్ ఆత్రేయతో కొత్త ప్రయోగం?

సరిపోదా శనివారం చిత్రంతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయతో కూడా బాలయ్య ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రారంభ దశలో ఉందని తెలుస్తోంది. బాలయ్యను పూర్తిగా కొత్త కోణంలో చూపించే కథను వివేక్ సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

పోలీస్ ఆఫీసర్‌గా బాలయ్య?

నాంది దర్శకుడు విజయ్ కనకమేడలతో కూడా బాలకృష్ణ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం హై ఓల్టేజ్ పోలీస్ యాక్షన్ డ్రామాగా రూపొందే అవకాశముందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ లైనప్‌ను చూస్తే రాబోయే రెండేళ్లు బాలయ్య అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. మాస్, యాక్షన్, ఎమోషన్, సోషల్ మెసేజ్.. ఇలా అన్ని జానర్లను టచ్ చేస్తూ బాలయ్య మరోసారి బాక్సాఫీస్‌పై తన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నాడు.

మళ్లీ పుడతామా ఏంటీ..

PanIndia | హైప్‌తో ఓపెనింగ్స్.. ఆ తరువాతే ‘‘అసలు కథ’’!