సేవలు బంద్.. ఎందుకంటే..?

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పేదలకు ఆరోగ్యశ్రీ పథకం (Arogyashri Scheme) ఒక వరం. ఎందుకంటే ఇది తెల్ల రేషన్‌కార్డు (White Ration Card) కలిగిన వారికి ఖరీదైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయ పథకం. ఈ పథకం ద్వారా రూ.5 లక్షల నుండి రూ.10 లక్షల వరకు వైద్య ఖర్చు (Medical Expenses) లను ప్రభుత్వం భరిస్తుంది, తద్వారా పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ పథకం పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించడమే కాకుండా, వారిపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. అలాంటి ఆరోగ్యశ్రీ పథకంపై నీలి నీడలు అలుముకున్నాయి.

అనారోగ్యం బారిన పడి తగిన చికిత్స చేయించుకునే స్థోమత లేని పేద ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకానికి బ్రేక్ పడనుంది. ఎంతోమందికి సంజీవనిగా ఉన్న ఆరోగ్యశ్రీ సేవలు ఇకపై కొనసాగుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ మేరకు ‘టీఏ ఎన్‌హెచ్‌ఏ’ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేశ్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్యశ్రీ కింద అనుసంధానమైన 323 ప్రైవేటు నెట్‌వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి పెద్దమొత్తంలో బకాయిలు రావాల్సి ఉందని, ఈ విషయమై ఆరోగ్య శాఖ మంత్రి (Health Minister), ఆరోగ్యశ్రీ సీఈవోలను కలిశామని, అయినా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.

గత ఏడాది కాలంగా ఆరోగ్యశ్రీకి, 18 నెలలుగా ఈహెచ్‌ఎస్‌కు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం చెల్లించడం లేదని ఆయన ఆరోపించారు. పేరుకుపోయిన బకాయిల వల్ల ఆస్పత్రుల నిర్వహణ తీవ్ర భారంగా మారిందని, ఈ పరిస్థితుల్లో సేవలను కొనసాగించలేమని ఆయన వివరించారు. నెట్‌వర్క్ ఆస్పత్రుల లెక్కల ప్రకారం, ప్రభుత్వ బకాయిలు సుమారు రూ.1,200 కోట్ల నుంచి రూ.1,400 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ ట్రస్టు సోమవారం నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.100 కోట్లు విడుదల చేసింది. అయితే, ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని, బకాయిలతో పోలిస్తే ఇది చాలా తక్కువని ఆస్పత్రుల యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అందుకే ముందుగా ప్రకటించినట్లే సేవలు నిలిపివేయాలన్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు తేల్చిచెప్పాయి.
