APL | కింగ్స్ సూపర్ సూపర్ విక్టరీ
APL | కింగ్స్ సూపర్ సూపర్ విక్టరీ
- తొలి మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగల్లో ఆకట్టుకున్న కాకినాడ టీం
- కాకినాడ టీం బ్యాటింగ్ లో యువన్ అర్ధ శతకం,
- బౌలింగ్ లో ఆంజనేయులు కు 3 వికెట్స్
- మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా యువన్, ఆంజనేయులు
- 72 పరుగుల తో కాకినాడ కింగ్స్ గ్రాండ్ విక్టరీ
విశాఖపట్నం, ఆంధ్రప్రభ స్పోర్ట్స్: విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్-5 ఘనంగా ప్రారంభమైంది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో ఎలాంటి ఆర్భాట కార్యక్రమాలు నిర్వహించకుండా టోర్నీని ప్రారంభించారు.
మ్యాచ్ ప్రారంభానికి ముందు ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు రెండు జట్ల ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టాస్ కార్యక్రమంలో పాల్గొని ఇరు జట్లను అభినందించారు. టాస్ గెలిచిన సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
కాకినాడ కింగ్స్ బ్యాటర్ల విధ్వంసం
మొదట బ్యాటింగ్‌కు దిగిన కాకినాడ కింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు అభిషేక్, అర్జున్ వేగంగా పరుగులు సాధిస్తూ జట్టుకు శుభారంభం అందించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన తపస్వి, మనీష్ కూడా అదే జోరును కొనసాగించారు.
మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత క్రీజులోకి వచ్చిన యువన్ మాత్రం వైజాగ్ లయన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రెండు ఫోర్లు, ఆరు భారీ సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జట్టు 200 పరుగుల మార్క్ చేరడంలో యువన్ కీలక పాత్ర పోషించాడు.
చివర్లో వికెట్ కీపర్ లక్షాజ్ రెడ్డి కేవలం 7 బంతుల్లోనే రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో వేగంగా పరుగులు రాబట్టాడు. దీంతో కాకినాడ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
వైజాగ్ లయన్స్ తరఫున గిరినాథ్ రెడ్డి, ఢిల్లీ గణేష్, వినయ్ కుమార్, త్రిపురాన విజయ్ తలో వికెట్ తీశారు.
చేజింగ్‌లో కుప్పకూలిన వైజాగ్ లయన్స్
220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్టు ఆరంభంలో వేగంగా ఆడింది. తొలి వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా, ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది.
10 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 85 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ రికీ భూయ్ (32), త్రిపురాన విజయ్ (33) పోరాడినప్పటికీ మిగతా బ్యాటర్లు విఫలమవడంతో జట్టు కోలుకోలేకపోయింది.
కాకినాడ కింగ్స్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ఫలితంగా సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్టు 18.4 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయింది.
ఆంజనేయులు ధాటికి లయన్స్ చిత్తు
కాకినాడ కింగ్స్ బౌలర్లలో ఆంజనేయులు మూడు కీలక వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన కాకినాడ కింగ్స్ 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఏపీఎల్-5లో విజయంతో బోణీ కొట్టింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
అద్భుతమైన మెరుపు ఇన్నింగ్స్‌తో కాకినాడ కింగ్స్ విజయానికి బాటలు వేసిన యువన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అతని దూకుడైన బ్యాటింగ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.
