Nirmal | బాసరలో హృదయ విదారక ఘటన..

Nirmal | బాసరలో హృదయ విదారక ఘటన..

  • ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముల మృతి..

బాసర, నిర్మల్ జిల్లా : సెలవు రోజు.. కుటుంబంతో ఆనందంగా గడపాలని భావించారు. గోదావరి తీరానికి వెళ్లి కాసేపు సరదాగా స్నానం చేసి తిరిగి ఇంటికి చేరుకోవాలనుకున్నారు. కానీ విధి వేరే రాత రాసింది. ముగ్గురు అన్నదమ్ములు గోదావరి ప్రవాహంలో చిక్కుకుని మృత్యువు ఒడిలో చేరిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కుమారులను కోల్పోయిన ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. నిర్మల్ జిల్లా బాసరలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

మంగళవారం మధ్యాహ్నం బాసరలోని త్రిబుల్ ఐటీ ఇంటెక్ వాల్ సమీపంలో గోదావరి నదిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని కాచిగూడ చేపల బజార్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు అన్నదమ్ములు గోదావరిలో స్నానానికి దిగారు. అయితే నదిలోని లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో ప్రమాదవశాత్తు ప్రవాహంలో చిక్కుకుని గల్లంతయ్యారు.

గల్లంతైన వారిని చంద్రశేఖర్ (38), రామచందర్ (36), మల్లేష్ కుమార్ (31)గా గుర్తించారు. ముగ్గురు కనిపించకపోవడంతో అక్కడున్న వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు.

Nirmal

మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం వరకు నదిలో విస్తృతంగా గాలింపు నిర్వహించినప్పటికీ మొదట మృతదేహాలు లభించలేదు. అనంతరం స్థానిక గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు కొనసాగించగా ముగ్గురు అన్నదమ్ముల మృతదేహాలు బయటపడ్డాయి. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని కలచివేశాయి.

ముగ్గురు కుమారులు ఒకేసారి మృతి చెందారన్న వార్త తెలియగానే కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఒకే ఇంట్లో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆనందంగా వెళ్లిన వారు తిరిగి శవాలుగా రావడం అందరినీ విషాదంలో ముంచెత్తింది.

సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు బాసరకు చేరుకుని గోదావరి తీరంలో బోరున విలపించారు. వారి రోదనలు అక్కడి వాతావరణాన్ని మరింత విషాదభరితంగా మార్చాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు బాసర సీఐ దీపక్ తెలిపారు.

ఈ ఘటన మరోసారి నదులు, జలాశయాల్లో స్నానానికి వెళ్లే సమయంలో అప్రమత్తత ఎంత అవసరమో గుర్తు చేసింది. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమైన వేళ నదుల్లో ప్రవాహం, లోతు అంచనా వేయడం కష్టమవుతుందని, నిర్లక్ష్యం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.