సమాజానికి మేలు చేసే వారు స్ఫూర్తిదాయకులు
సమాజానికి మేలు చేసే వారు స్ఫూర్తిదాయకులు
- గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
గుడ్లవల్లేరు, ఆంధ్రప్రభ:
సమాజానికి మేలు చేసే వారిని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. ముఖ్యంగా జన్మనిచ్చిన ప్రాంతాల అభివృద్ధికి దాతల సహకారం గొప్ప విషయం అని కొనియాడారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలోని కానూరి దామోదర్ జిల్లా పరిషత్ పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చారు. పాఠశాల పూర్వ విద్యార్థి బొబ్బా వీఆర్ చౌదరి దంపతులు రూ.కోటి విరాళం ప్రకటించి, మొదటి విడతగా రూ.50 లక్షలతో చేపడుతున్న నూతన భవన నిర్మాణం, ల్యాబ్ బిల్డింగ్ అదనపు అంతస్తు పనులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదివారం ఉదయం శంకుస్థాపన చేశారు.
ఎమ్మెల్యే రాము గ్రామ పెద్దలు, దాతలతో కలిసి భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులు ప్రారంభించారు. అనంతరం దాత బొబ్బా వీఆర్ చౌదరి దంపతులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ… దశాబ్దాల తర్వాత కూడా చదువుకున్న బడి అభివృద్ధి కోసం ముందుకు వచ్చిన చౌదరి దంపతులు ఆదర్శప్రాయులన్నారు. గుడివాడ పరిసర ప్రాంతాల్లో పుట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో ఉన్నవారు జన్మభూమికి మేలు చేస్తుండడం గొప్ప విషయమన్నారు. దాతల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు విజయవంతం చేస్తామని హామీ ఇచ్చారు.
దాత వీఆర్ చౌదరి మాట్లాడుతూ, పాఠశాల మొదటి బ్యాచ్‌లో చదువుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. తాము తలపెట్టిన సంకల్పానికి గ్రామ పెద్దలు, ఎమ్మెల్యే రాము, అధికారులు సహకరించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గుడ్లవల్లేరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పొట్లూరి రవి, గుడ్లవల్లేరు మండల టిడిపి అధ్యక్షుడు పోలవరపు వెంకటరావు, పార్టీ నాయకులు వల్లభనేని బాబురావు, చేకూరు జగన్మోహన్రావు, కొండలమ్మ గుడి చైర్మన్ ఈడే మోహన్, మండల నాయకులు మల్లిపెద్ది సుబ్రమణ్యం, డీసీ చైర్మన్ ఆంజనేయులు, కొడాలి రామరాజు,పేన్నేరు రమేష్, కాగిత నరేంద్ర, తోట చిన్నారి, బొప్పాన శివప్రసాద్, ఈడే కృష్ణారావు, పెద్ది బోయిన రాజు, జోజి, కంచర్ల ప్రకాష్,గరికిపాటి బ్రదర్స్,బొర్రా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
