పేద విద్యార్థుల భవిష్యత్తుకు అండగా అనుమోలు వంశవృక్షం
పేద విద్యార్థుల భవిష్యత్తుకు అండగా అనుమోలు వంశవృక్షం
- ఎమ్మెల్యే బోడే ప్రసాద్
పెనమలూరు, ఆంధ్రప్రభ:
సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థుల విద్యాభివృద్ధికి చేయూతనందించడం గొప్ప సేవ అని పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ పేర్కొన్నారు. అనుమోలు వంశవృక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా సహాయ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్థికంగా స్థిరపడిన కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 25 మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం సుమారు రూ.7 లక్షల ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని ఆయన కొనియాడారు.
మన విజయాల వెనుక సమాజం పాత్ర కూడా ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. విద్యార్థులు ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించి తమ లక్ష్యాలను సాధించాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుని మరెందరికో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
సమాజంలో సానుకూల మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ తమ సామాజిక బాధ్యతను గుర్తించి సేవాభావంతో ముందుకు రావాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రతిఫలం ఆశించకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం సహాయం చేస్తున్న అనుమోలు కుటుంబ సభ్యుల సేవా తత్వం ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అనుమోలు వంశవృక్షం సభ్యులను, దాతలను, నిర్వాహకులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.
