Bigg Boss Telugu Season 10 | ఈసారి నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ!

Bigg Boss Telugu Season 10 |ఈసారి నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ!

Bigg Boss Telugu Season 10 |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ః తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఇప్పుడు సరికొత్త మైలురాయిని అందుకోవడానికి సిద్ధమైంది. గత తొమ్మిది సీజన్లుగా ప్రేక్షకులను టీవీల ముందు కట్టిపడేసిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో.. ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా పదో సీజన్ లోకి అడుగుపెడుతోంది. తాజాగా విడుదలైన ఈ సీజన్ ప్రోమో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. సాధారణంగా బిగ్ బాస్ ప్రోమోలు అంటేనే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ఈసారి పదో సీజన్ కావడంతో సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రోమోను డిజైన్ చేశారు. ముఖ్యంగా ఈ ప్రోమోలో వినిపించిన “ఆటలో సవాలు కాదు.. ఆటే సవాలు” అనే క్యాప్షన్ ప్రేక్షకులలో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసింది. అంటే ఈసారి కేవలం టాస్కుల్లో మాత్రమే కాకుండా, హౌస్‌లో అడుగుపెట్టిన క్షణం నుంచే కంటెస్టెంట్లకు ప్రతి రోజూ, ప్రతి క్షణం ఒక పెద్ద సవాలుగా మారబోతుందనే సంకేతాన్ని నిర్వాహకులు ఇచ్చేశారు.

ఒక రియాలిటీ షో ప్రాంతీయ భాషలో పది సీజన్ల పాటు విజయవంతంగా కొనసాగడం అనేది సాధారణ విషయం కాదు. ఎమోషన్స్, డ్రామా, గొడవలు, ఫ్రెండ్‌షిప్, లవ్.. ఇలా అన్ని రకాల రసాలను పండిస్తూ పదేళ్లుగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బిగ్ బాస్ చెరగని ముద్ర వేసుకుంది. ప్రతి సీజన్‌కు రేటింగ్స్ పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తూ వస్తోంది. ఇప్పుడు రాబోయే 10వ సీజన్ అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పదో సీజన్ ల్యాండ్ మార్క్ సీజన్ కాబట్టి, బిగ్ బాస్ హౌస్‌ను మునుపెన్నడూ లేని విధంగా అత్యంత విలాసవంతంగా, అదే సమయంలో సరికొత్త థీమ్‌తో డిజైన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఈసారి కంటెస్టెంట్ల ఎంపిక కూడా చాలా క్రేజీగా ఉండబోతున్నట్లు సమాచారం. సోషల్ మీడియా స్టార్స్, సెలబ్రిటీలతో పాటు వెండితెరపై మెరిసిన కొందరు సీనియర్ నటీనటులను కూడా రంగంలోకి దించుతున్నారట. గట్టి పోటీ ఇచ్చే వారినే హౌస్‌లోకి పంపేలా స్క్రీనింగ్ జరుగుతోంది. ‘ఆటే సవాలు’ అనే క్యాప్షన్‌కు తగ్గట్టుగానే.. మొదటి వారం నుంచే ఊహించని ఎలిమినేషన్లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, సీక్రెట్ రూమ్ టాస్కులతో ప్రేక్షకులకు మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్టులు ఇవ్వబోతున్నారు.

ఇక బిగ్ బాస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది కింగ్ నాగార్జున హోస్టింగ్. తనదైన శైలిలో కంటెస్టెంట్లకు క్లాస్ పీకుతూ, తప్పు చేసిన వారిని సున్నితంగా హెచ్చరిస్తూ షోను నడిపించడంలో ఆయన దిట్ట. ఈ ల్యాండ్ మార్క్ 10వ సీజన్‌కు కూడా నాగార్జున తనదైన గ్రేస్‌తో హోస్ట్‌గా వ్యవహరించి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మొత్తానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రోమోతోనే అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లిపోయింది. “ఆటే సవాలు” అంటూ రాబోతున్న ఈ సరికొత్త రణరంగాన్ని చూడటానికి బుల్లితెర ప్రేక్షకులు ఇప్పటి నుంచే కౌంట్‌డౌన్ ప్రారంభించేశారు. మరి ఈ పదో సీజన్ ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.