మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యం

మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యం

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేయడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని భీమ్‌గల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆరిగేల జనార్దన్ అన్నారు. శనివారం భీమ్‌గల్ మండలం పిప్రి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా సంఘాల శాశ్వత భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలోని స్వయం సహాయక సంఘాల (SHG) సంక్షేమం కోసం రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదన్నారు. మహిళా సంఘాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందనడానికి ఈ భవన నిర్మాణాలే నిదర్శనమని పేర్కొన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక రకాల పథకాలను అమలు చేస్తోందని, ఇలాంటి శాశ్వత భవనాల నిర్మాణం వారిలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఈ రమేష్, ఉప సర్పంచ్ పతాని జేమ్స్, సెక్రటరీ శ్రీధర్, కారోబార్ ముత్తన్న, మాజీ సర్పంచ్ దుర్గి రాజేందర్ గౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ గంగస్వామి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రాజేష్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.