ఇనుప పరికరాలతో అమరవీరుల స్థూపం

ఇనుప పరికరాలతో అమరవీరుల స్థూపం
ఏర్గట్ల, ఆంధ్రప్రభ:
తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన గ్రామీణ యువకుడు రాజారాపు సతీష్ తన కళాత్మక ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించాడు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు వినూత్నంగా నివాళులర్పిస్తూ, ఇనుప పరికరాలతో తెలంగాణ అమరవీరుల స్థూపం నమూనాను రూపొందించాడు.
రాజారాపు సతీష్ వృత్తిరీత్యా వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో విద్యార్థులు, అమరవీరుల త్యాగాలు తనను ప్రభావితం చేశాయని తెలిపాడు. ఆ ఆవేదన, గౌరవ భావంతో తన పనిలో ఉపయోగించే చిన్న చిన్న ఇనుప పరికరాలు, ఇనుప ముక్కలను సేకరించి ఈ నమూనాను తయారు చేసినట్లు వివరించాడు.
హైదరాబాద్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపాన్ని తలపించేలా ఈ నమూనాను రూపొందించాడు. దీనిపై అశోక చక్రాన్ని అమర్చడంతో పాటు, అమరుల త్యాగానికి ప్రతీకగా ఎరుపు రంగు, శాంతికి చిహ్నంగా తెలుపు రంగు వాడాడు. కింది భాగంలో ‘జై తెలంగాణ’ అని తెలుగు అక్షరాల్లో లిఖించాడు.
సతీష్ తన వృత్తి నైపుణ్యాన్ని తెలంగాణ భావంతో మేళవించి రూపొందించిన ఈ నమూనా ప్రస్తుతం స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది. ఎలాంటి ఆధునిక సాంకేతిక సదుపాయాలు లేకపోయినా, కేవలం వెల్డింగ్ పరికరాలతో ఇలాంటి ఆకృతి రూపొందించడం విశేషమని మండల ప్రజలు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉండి తన ప్రతిభను చాటుకున్న సతీష్‌ను స్థానికులు, పలువురు ప్రముఖులు అభినందించారు.
