మత్రియా తండాలో అనుమానాస్పద హత్య
మత్రియా తండాలో అనుమానాస్పద హత్య
పలు కోణాల్లో పోలీసుల దర్యాప్తు
ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : ఎ.కొండూరు మండలం మత్రియా తండా గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన ఓ వ్యక్తి హత్య స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన ధారావతు శ్రీరాములు (38) మృతి చెందిన ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతుడి భార్య నాగమణి,ఆమె బావమరిది కొర్ర మనోహర్‌బాబు కలిసి శ్రీరాములను హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనలో మరొక వ్యక్తి ప్రమేయం కూడా ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తూ,పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని పోలీసులను కోరారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణానికి గల ఖచ్చితమైన కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ హత్య కేసును పోలీసులు అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. కేసుకు సంబంధించిన అనుమానితులను గోప్యంగా తిరువూరు సీఐ కార్యాలయంలో విచారిస్తున్నట్లు తెలిసింది.ఘటన వెనుక ఉన్న అసలు కారణాలు, ఇతరుల ప్రమేయం వంటి అంశాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.కాగా పూర్తి వివరాలు పోలీసుల అధికారిక ప్రకటన అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
